● అయోమయంలో అన్నదాతలు ● నాలుగో విడతలోనూ పేరు రాకపోవడంతో
ఈ రైతు పేరు చెన్నుపాటి ప్రభాకర్‌రావు. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఇతను స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2023 జూన్‌లో రూ.2 లక్షల పంట రుణం తీసుకున్నాడు. 2024 ఆగస్టులో రుణాన్ని రెన్యూవల్ చేసుకోగా అతని పేరుపై రూ.1.94 లక్షల రుణం మాత్రమే ఉంది. రుణమాఫీకి అన్నీ రకాలుగా అర్హుడిగానే ఉన్నా రుణమాఫీ కాలేదని వాపోతున్నాడు. మరో జాబితాను ప్రకటించి రుణమాఫీ చేయాలని కోరుతున్నాడు. వీరే కాకుండా జిల్లా వ్యాప్తంగా అర్హులైనా రుణమాఫీ కాని రైతులు చాలా మంది ఉన్నారు. రుణమాఫీ కాక బయట వడ్డీలకు అప్పులు తీసుకుని బ్యాంకుల్లో రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వాంకిడి(ఆసిఫాబాద్): నాలుగు విడతలుగా రైతుల రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం మళ్లీ ఐదో విడత మాఫీ ప్రక్రియ చేపడుతుందా? లేదా? అనే విషయంపై మాఫీ కానీ రైతుల్లో సందిగ్ధం నెలకొంది. జిల్లాలోని సుమారు 25 నుంచి 30 శాతం రైతుల పంట రుణాలు మాఫీ కాలేదని సమాచారం. అయి తే ప్రభుత్వం నుంచి ఐదో విడతపై ఎలాంటి స్పష్ట త లేకపోవడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొంది. రూ.2లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రెండు లక్షల పైన ఉన్న మొత్తాన్ని రైతులు అప్పులు చేసి మరీ బ్యాంకులకు చెల్లించారు. కానీ నాలుగో విడత ముగిసి మూడు నె లలు కావస్తున్నా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ‘మాకెప్పుడు రు ణమాఫీ’ అంటూ వ్యవసాయ కార్యాలయాలు, పీఏ సీఎస్‌లు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరుతున్నారు.
అప్పులు చేసి చెల్లించారు..
రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల లోపు పంట రుణాలు ఉన్న వారికి మాత్రమే మాఫీ చేయడం జరుగుతుందని, ఆ పైన ఉన్న మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని చెప్పడంతో రూ.2లక్షల పైన రుణాలు ఉన్న రైతులు అప్పులు చేసీ మరీ పైన ఉన్న మొత్తాన్ని చెల్లించారు. కానీ చాలా మంది రైతులకు మాఫీ కాలేదు. మొదటి విడతలో రూ.లక్షలోపు. రెండో విడతలో రూ.లక్షన్నర లోపు, మూడో విడతలో రూ.రెండు లక్షల లోపు రుణాలు ఉన్నవారికి మాఫీ చేశారు. వివిధ కారణాలతో మాఫీ కానీ రైతుల నుంచి రైతు వేదికల్లో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంకు ఖాత లాక్ పడి ఉండటం, ఆధార్ కార్డులో పట్టా పాస్‌పుస్తకంలో పేర్లు వేరుగా, తప్పుగా ఉండటం, ఫోన్ నంబర్లు సరిపోలకపోవడం వంటి కారణాలతో రుణమాఫీకి నోచుకోని రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించారు. రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వం నాలుగో విడతలోనూ మాఫీ ప్రక్రియ చేపట్టింది. కానీ అందులో కూడా చాలా మంది అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తించలేదు. ఎక్కువగా రేషన్ కార్డు లేకుండా రూ.2 లక్షల లోపు రుణం కలిగి ఉన్న వారికి మాత్రమే మాఫీ జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 30 శాతం రైతులకు మాఫీ వర్తించ లేదని తెలుస్తోంది. నాలుగో విడతలో అత్యధికంగా రేషన్ కార్డు లేని వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుని రుణమాఫీ చేశారు. అనేక కారణాలతో చివరి విడత తరువాత దరఖాస్తు చేసుకున్న చాలా వంది రైతులు చేసిన అప్పులు తీర్చలేక, బ్యాంకులో వడ్డీ పెరిగిపోతుందని ఆందోళనకు గురవుతున్నారు.
విడతల వారీగా మంజూరు..
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చి న హామీ మేరకు నాలుగు విడతల్లో 51,583 మంది రైతులకు రూ.465,36,95,472 రుణాలు మాఫీ చేసింది. మొదటి విడతలో 21,776 మంది రైతుల కు గానూ రూ.123.77 కోట్లు, రెండవ విడతలో 14,410 మంది రైతులకు గానూ రూ.150.80 కోట్లు, మూడో విడతలో 11,733 రైతులకు గానూ రూ.154.08 కోట్లు, నాలుగో విడతలో 3,664 మంది రైతులకు గానూ రూ. 36.70 కోట్లు మాఫీ చేసింది. మూడో విడతలో పేర్లు రాణి రైతులకు నాలుగో విడతలో పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ ఇంకా చాలామంది రైతులు మరో జాబితాపై ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఎదురు చూస్తున్నాం..
అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదు. నా కుటుంబంలోని నలుగురి పేరున బ్యాంకులో రూ.2.40 లక్షల పంట రుణం తీసుకున్నా. కనీసం నాలుగో విడతలోనైనా మాఫీ అవుతుందనుకున్నా. కానీ కాలేదు. రైతు వేదికలో దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఫలితం లేదు. కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.
– కాటేల కళ, దహెగాం
ఎలాంటి సూచనలు రాలేదు
మొదటి విడతలో రూ.లక్ష లోపు, రెండో విడతలో రూ.1.50 లక్షల లోపు, మూడో విడతలో రూ.2లక్షలలోపు రైతుల రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది. వివిధ కారణాలతో మూడో విడతలోనూ మాఫీ కాని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి నాలుగో విడతలో రూ.2లక్షల లోపు రుణాలను మాఫీ చేశాం. మరో జాబితాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.
– శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి
● అయోమయంలో అన్నదాతలు ● నాలుగో విడతలోనూ పేరు రాకపోవడంతో
● అయోమయంలో అన్నదాతలు ● నాలుగో విడతలోనూ పేరు రాకపోవడంతో
● అయోమయంలో అన్నదాతలు ● నాలుగో విడతలోనూ పేరు రాకపోవడంతో
Comments
Please login to add a commentAdd a comment