
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ఎమ్మెల్సీ దండె విఠల్
కాగజ్‌నగర్‌రూరల్: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని ఇందిరా మార్కెట్ ఏరియా, కాగజ్‌నగర్ మండలం భట్‌పల్లి గ్రామంలోని రేషన్‌షాపుల్లో మంగళవారం సన్నబియ్యం పంపిణీని అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పేదవారికి సన్నబియ్యం భోజనం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. చరిత్రలో శాశ్వతంగా ఈ పథకం నిలిచిపోతుందన్నారు. ప్రజా సంక్షేమంలో భాగంగా ఆరు గ్యారంటీ పథకాలతో మహిళలకు పెద్దపీట వేస్తూ మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాజీవ్ యువ వికాసం, అర్హులైన పేదవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్‌కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, నాయకులు లావణ్య శరత్, మురళీగౌడ్, షబ్బీర్, సురేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.