
మెరుగుపడేనా..?
పశువైద్యం
● కొత్త మండలాల్లో వైద్యశాలల ఏర్పాటుకు సర్కారు నిర్ణయం ● ఖాళీ పోస్టులు భర్తీ చేస్తేనే ప్రయోజనం ● జిల్లాలో 10.40 లక్షల పశువులు
తిర్యాణి(ఆసిఫాబాద్): పశువైద్యాన్ని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాలన సౌలభ్యం కోసం ఎనిమిదేళ్ల క్రితం నూతన మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా మండలాల్లో ఆస్పత్రులు లేక పాడి రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నూతన పశువైద్యశాలలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే నూతన పశువైద్య శాలలు ఏర్పాటు చేయడంతోపాటు వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలని పాడి రైతులు కోరుతున్నారు.
19 ప్రాథమిక పశు వైద్యశాలలు
జిల్లాలో 19 ప్రాథమిక పశు వైద్యశాలలు, రెండు ప్రాంతీయ పశు వైద్యశాలలు, ఏడు ఉప కేంద్రాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 10.40 లక్షల పశువులు ఉండగా, ఇందులో 2.93 లక్షల ఆవులు, ఎద్దులు, 46వేల గేదెలు, 1.59 లక్షల గొర్రెలు, 2.56 లక్షల మేకలు, ఇతర జంతువులు, కోళ్లు ఉన్నాయి. జిల్లాలోని రైతులు, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వ్యవసాయం తర్వాత పాడి సంపదతో ఆదాయం పొందుతున్నారు.
నూతన వైద్యశాలలకు అవకాశం
లింగాపూర్ మండలం ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తుంది. ఇక్కడి గిరిజనులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో వింత రోగాలు, చర్మ వ్యాధులతో పశువులు మృత్యువాత పడుతున్నారు. స్థానికంగా ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రి లేదు. మైత్రి సెంటర్ నిర్వాహకుడు గ్రామాల్లో తిరుగుతూ నామమాత్రపు వైద్యం చేస్తున్నాడు. అత్యవసర సమయంలో కొంతమంది రైతులు 12 కిలో మీటర్ల దూరంలోని సిర్పూర్(యూ) మండల కేంద్రానికి వెళ్తున్నారు. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో అధిక ధరకు కొనుగోలు చేస్తుండటంతో పాడి రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వం కొత్త మండలాల్లో నూతన పశు వైద్యశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లింగాపూర్‌తోపాటు చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్ మండలాలు నూతనంగా ఏర్పడ్డాయి. అయితే పెంచికల్‌పేట్ మండల కేంద్రంతోపాటు చింతలమానెపల్లి డబ్బా గ్రామంలో ఇప్పటికే పశు వైద్యశాలలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లింగాపూర్‌తోపాటు పశువుల సంఖ్యకు అనుగుణంగా ఇతర ప్రాంతాల్లోనూ నూతన ఆస్పత్రులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
పశువైద్యశాల ఏర్పాటు చేయాలి
లింగాపూర్ మండలంలో పశువైద్యశాల లేక ఇబ్బందులు పడుతున్నాం. అత్యవసర సమయంలో ప్రైవేట్ వాహనాల్లో పశువులను ఎక్కించుకుని సిర్పూర్(యూ)కు వెళ్తున్నాం. అక్కడ కూడా డాక్టర్ లేకపోతే మూగజీవాలు చనిపోవాల్సిందే.. ఇప్పటికై నా లింగాపూర్‌లో పశువైద్యశాల ఏర్పాటు చేయాలి.
– రాథోడ్ సంతోష్, రైతు, లింగాపూర్
ఏజెన్సీలో అందని వైద్యం
జిల్లావ్యాప్తంగా 19 ప్రభుత్వ ప్రాథమిక పశు వైద్య కేంద్రాలు ఉండగా, ఇందులో జైనూర్, సిర్పూర్(యూ), గిన్నెధరి, డబ్బా, బెజ్జూర్ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ఏజెన్సీ మండలాలైన సిర్పూర్(యూ), జైనూర్‌లో వైద్యులు లేకపోవడం, లింగాపూర్‌లో అసలు ఆస్పత్రే లేకపోవడంతో పశువులకు వైద్యం చేయించేందుకు పాడి రైతులు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయంలో గోపాల మిత్రలపై ఆధారపడాల్సి వస్తోంది. కనీసం ఇన్‌చార్జి వైద్యులు కూడా లేకపోవడంతో పలు వ్యాధులతో పశువులు మృత్యువాత పడుతున్నా అన్నదాతలు ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారు.

మెరుగుపడేనా..?