● సర్కారు విద్యార్థుల యూనిఫాంలో మార్పులు ● ఈసారి నిక్కర్‌కు బదులుగా ప్యాంట్ ● జిల్లాలో 47,530 మంది విద్యార్థులు
ఆసిఫాబాద్‌రూరల్: సర్కారు పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫాం అందజేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు నిక్కర్‌కు బదులుగా ప్యాంటు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన జీవో సైతం జారీ చేసింది. గతంలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు నిక్కర్, చొక్కా, ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్యాంట్, చొక్కా అందజేశారు. కానీ ఈసారి ఆరో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ప్యాంట్, చొక్కా అందజేయనున్నారు. దీనికి సంబంఽధించిన వస్త్రం ప్రభుత్వం నుంచి రానున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
47,530 మంది విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేస్తోంది. జిల్లాలో డీఈవో పరిధిలో 739 పాఠశాలతో పాటు గిరిజన ప్రైమరీ స్కూల్, కేజీబీవీ, మోడల్ స్కూల్, యూఆర్‌జేసీ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం కుట్టించి అందజేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 930 పాఠశాలల్లో 47,530 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున అందజేయనున్నారు. ఇందులో బాలురు 22,518 మంది, బాలికలు 25,012 మంది ఉన్నారు. వీరి కోసం 1,90,902 మీటర్ల వస్త్రం వచ్చింది. గతంలో ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు సైతం నిక్కరే ఇవ్వడంతో పెద్దపిల్లలు వాటిని వేసుకోలేకపోయారు. ఇది గుర్తించిన విద్యాశాఖ ఈసారి నిక్కర్‌కు బదులు ప్యాంటు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో 8,625 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
జూన్ 10లోగా పూర్తిచేస్తాం
రాబోయే విద్యాసంవత్సరం జూన్ 10వ తేదీలోగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫాం కుట్టించి ఇస్తాం. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – మధుకర్, ఎస్‌వో
మహిళా సమాఖ్యలకు కుట్టే బాధ్యతలు
విద్యార్థుల అవసరమైన ఏకరూప దుస్తులు స్టిచ్చింగ్ చేసే బాధ్యత స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించనున్నారు. విద్యాశాఖ నుంచి మండల శాఖ కార్యాలయానికి అక్కడి నుంచి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా క్లాత్ కటింగ్ చేసి పాఠశాలలుగా విభజించి స్వయం సహాయక సంఘాలకు స్టిచ్చింగ్‌కు ఇస్తారు. వీరికి ఒక్కో జతకు రూ.75 చొప్పున కుట్టుకూలి ఇవ్వనున్నారు. కాగా గతేడాది కుట్టిన డబ్బులే ఇంకా రానట్లు తెలుస్తోంది.