
భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్: జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, భూగర్భ జలశాఖ, మిషన్ భగీరథ ఇంజినీర్లు, ప్రజారోగ్య కార్యనిర్వాహక శాఖ ఇంజినీర్లు, నీటి పారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ శాఖ అధికారులతో కూడిన పర్యవేక్షక కమిటీతో సమావేశమయ్యారు. నీటి వినియోగం, పొదుపు, భూగర్భ నీటి మట్టం తరిగిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ నీటి మట్టాన్ని పెంపొందించేందుకు పర్యవేక్షక కమిటీ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీరు, తాగునీరు పొదుపుగా వినియోగించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. చేతిపంపులు, బావులు, సాగునీటి చెరువులు, ప్రాజెక్టులు, వ్యవసాయ పంపుసెట్ల పూర్తి వివరాల నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.