10న విజయవాడలో అంగన్‌వాడీల మహాధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది నెలలు దాటినా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సుబ్బరావమ్మ అన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ 42 రోజులపాటు చారిత్రక సమ్మె నిర్వహించామని, ఫలితంగా ఆరు జీవోలు సాధించినా వేతనాలు పెరగలేదన్నారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇఫ్టూ సంఘాల ఆధ్వర్యంలో మార్చి 10న విజయవాడలో మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, గ్రాట్యూటీ, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల విషయంలో రాజకీయ జోక్యం అరికట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సెంటర్ అద్దెలు, టీఏ బిల్లులు, ఒకే యాప్ విధానం, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ, తల్లికి వందనం పథకం అమలు చేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను బడ్జెట్ సమావేశాల్లో పరిష్కరించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో యూనియన్ ఉపాధ్యక్షుడు ఎన్.సి.ఎచ్.సుప్రజ,అధ్యక్షురాలు ఎస్.మంజుల, ప్రధాన కార్యదర్శి వి.ఆర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment