
శుభాలనిచ్చే రంజాన్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ముస్లింలకు రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం ఎన్నోరెట్ల ఫలితాలను అందిస్తుందని వారి విశ్వాసం. ఆదివారం నుంచి ఉపవాసదీక్షలు ప్రారంభమవుతాయని మతపెద్దలు తెలిపారు. రంజాన్ ప్రత్యేక నమాజ్‌లకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మసీదులు ముస్తాబయ్యాయి.
ఖురాన్ అవతరించిన మాసం
రంజాన్‌ను దివ్య ఖురాన్ భూమిపై అవతరించిన మాసంగా భావిస్తారు. ఈ నెల మొత్తం ముస్లింలు భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. ఈ నెలలో ‘సఫిల్’ చదివితే ‘ఫరజ్’ చదివినంతగా.. అంటే 70 సార్లు నమాజ్ చేసిన పుణ్యం వస్తుందని ఇస్లాం గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. ఈ మాసంలో ముస్లింలు దానధర్మాలకు (జకాత్, ఫిత్రాకు) ప్రాధాన్యమిస్తారు. ఈ నెల రోజుల్లో చేసిన దానాలు 70 రెట్లు అధిక ఫలితాన్ని అందిస్తాయని వారి నమ్మకం. ఈ నెలలో తాక్‌రాత్ రోజులకు ప్రత్యేకత ఉంది. ప్రతి ముస్లిం ఫిత్రా (నిర్ణీత దానం) తప్పనిసరిగా చేయాలి.
ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు
రోజా (ఉపవాసదీక్ష) పాటించే ముస్లింలు నమాజ్‌కు మొదటి ప్రాధాన్యమిస్తారు. దీని కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యోదయానికి ముందు (సహర్) నుంచి సూర్యాస్తమయం (ఇఫ్తార్) వరకూ ఉపవాసదీక్షలు పాటిస్తారు. దీక్షలో రోజుకు ఐదు పూటలా నమాజు చేస్తారు. దీనికి అదనంగా ‘తరావిహ్’ నమాజ్‌ను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు.
రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకూ సాగే ‘తరావిహ్’ నమాజులో ఖురాన్ పఠనం చేస్తారు. విజయవాడలో వందేళ్లకు పూర్వమే మసీదులను ఏర్పాటు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. సరాయి మసీదు, జుమ్మా మసీదుకు రంజాన్ మాసంలో రోజూ వందల సంఖ్యలో ముస్లింలు హాజరై సామూహిక నమాజ్‌లో పాల్గొంటారు. నగరంలోని వించిపేట, ఇస్లాంపేట, భవానీపురం, అరండల్‌పేట తదితర ప్రాంతాల్లో హలీం దుకాణాలు ఏర్పాటయ్యాయి.
పవిత్రమైన మాసం
రంజాన్ మాసం చాలా పవిత్రమైనది. ఈ నెల రోజులు మానవ జీవనాన్ని ఎంతగానే ప్రభావితం చేసే అనేక విషయాలను ఖురాన్ వివరించింది. వాటిని ఆచరిస్తే మానవ జీవితం సన్మార్గంలో పయనిస్తుంది. భగవంతుడి కృప లభిస్తుంది.
– నయీమ్ ఖదీర్, ఇమామ్, షాహీమసీద్, విజయవాడ
నేటి నుంచి ప్రారంభం ప్రత్యేక ప్రార్థనలకు మసీదుల ముస్తాబు

శుభాలనిచ్చే రంజాన్
Comments
Please login to add a commentAdd a comment