ఆయుర్వేదంలో విస్తృత పరిశోధనలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆయుర్వేదంలో విస్తృత పరిశోధనలు జరగాలని వక్తలు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ ఐలాపురం హోటల్‌లో ఆయుర్వేద ప్రాంతీయ పరిశోధన సంస్థ, విజయవాడ, కేంద్రీయ ఆయుర్వేద విజ్ఞాన పరిశోధనా పరిషత్ సంయుక్త ఆధ్వర్యాన ప్రజారోగ్య సంరక్షణ పరిశోధన కార్యక్రమంలో భాగంగా పరిశోధకుల కోసం రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. దేశంలోని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో వివిధ జాతులు, తెగలు, సమూహాల్లో ఆహార అలవాట్ల సమాచార సంగ్రహణపై శిక్షణ ఇస్తున్నట్లు ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఇన్‌చార్జి అసిస్టెంట్ డైరెక్టర్ బి. వెంకటేశ్వర్లు తెలిపారు. భిన్నప్రాంతాల్లో జాతిపరమైన, మతపరమైన ఆచారాల్లో ఉపయోగించే మొక్కలు, లోహాలు, ఖనిజాలు, జంతు ఉత్పత్తులు, ఇతర పదార్థాల సమాచార సంగ్రహణ అనే అంశాలపై శిక్షణ ఇస్తారన్నారు. డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ రబీనారాయణ వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాలు ఆయుర్వేద శాస్త్రంలో మరింత లోతుగా అవగాహన కల్పించేందుకు దోహదం చేస్తాయన్నారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నారాయణ శ్రీకాంత్, పమ్మి సత్యనారాయణశాస్త్రి, డాక్టర్ మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment