టీడీపీ కార్యకర్తా.. కమిషనరా !
● అధికార పార్టీకి తొత్తుగా మునిసిపల్ కమిషనర్ ● రెక్కాడితే గాని డొక్కాడని వారి షాపులను తొలగించారు ● కూటమి నాయకులు, మునిసిపల్ అధికారులపై ధ్వజమెత్తిన పేర్ని నాని
చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీడీపీ కార్యకర్తా.. లేక కమిషనరా తెలియని పరిస్థితుల్లో నగర ప్రజలు ఉన్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)అన్నారు. బుధవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం వద్ద అకారణంగా తొలగించిన ర్యాంపును తాత్కాలికంగా నిర్మించుకుంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తల వద్దకు వెళ్లి ర్యాంపు నిర్మాణం చేయవద్దంటూ మునిసిపల్ అధికారులు, పోలీసులు మంగళవారం రాత్రి అడ్డగించేందుకు ప్రయత్నించారు. దీంతో మాజీ మంత్రి పేర్ని నాని వారితో కొద్దిసేపు వాగ్వాదం చేసి మాకు దారి కావాలంటూ పార్టీ కార్యాలయంలోకి వెళ్లడానికి మార్గం లేకపోవటంతో తాత్కాలికంగా వేసుకుంటున్నామని అధికారులకు వివరించారు. అంతేకాకుండా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటే వాటిని కూడా నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పేర్ని నాని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తగిన పత్రాలను చూపించటంతో వారు వెనుతిరిగి వెళ్లిపోయారు.
కక్షపూరిత చర్యలు
అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కావాలనే కక్షపూరితంగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. నగరంలో ఆక్రమణలను తొలగిస్తున్నామని ప్రజలను ఉద్దరిస్తున్నారనే కారణంతో మేం పట్టించుకోవటం లేదని అయితే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల కట్టడాలను వదిలేసి పేదల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారన్నారు. మంత్రి నివాసం వద్ద, టీడీపీ నాయకుని కల్యాణ మండపం వద్ద తొలగింపులను వదిలేసి పేదలపై అక్కసుతో దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆక్రమణలు తొలగించిన వారు అధికారులు, టీడీపీ నేతలకు మళ్లీ డబ్బులిచ్చి తొలగించిన స్థానంలోనే షాపులను ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ఇవన్నీ అధికారులకు, కూటమి నాయకులకు కనపడవా అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయానికి వెళ్లే దారి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటే దానిని కూడా తొలగించేందుకు ప్రయత్నాలు చేశారని వచ్చిన అధికారిని అడిగితే తాత్కాలిక వేసిన దారిని తొలగించండి, పార్టీ కార్యాలయాన్ని ద్వంసం చేయండని మంత్రి పీఏ బాషా చెప్పినట్లు అధికారులు చెబుతుంటే తాను విస్మయం చెందానన్నారు.
విరుద్ధంగా ఏ పనీ చేయడం లేదు
అనంతపురం జిల్లా నుంచి వచ్చిన రూ. 10 వేల జీతగాడు అధికారులను శాసిస్తూ ఆయన ఆదేశాలతో అధికారులు బయలుదేరటం విడ్డూరంగా ఉందన్నారు. హక్కుల కోసం పోరాడతాం, ధర్మంగా ఉన్న నిబంధనల ప్రకారం తీసుకున్న ధ్రువీకరణ పత్రాలు చూపిస్తాం అంతే గాని విరుద్ధంగా ఏ పనిచేయటం లేదని పేర్ని నాని అన్నారు. అధికారం ఉంది కదా అని ఏదో చేయాలనుకుంటే అది శాశ్వతం కాదు. పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు వేసుకున్న ర్యాంపును పగలకొట్టమని ఆదేశాలు వచ్చాయని అందుకే వచ్చామని మునిసిపల్ అధికారులు చెప్పారన్నారు. నడమంత్రపు అధికారం వచ్చిందని మిడిసిపడితే భయడపడేది లేదని ఈ అధికారం ఎన్నాళ్లు ఉంటుందో ప్రజకే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. దొడ్డిదారిన నిచ్చెన వేసుకుని పారిపోయే సంస్కృతి మాకు లేదని నిజాన్ని నిర్భయంగా చెప్పి పోరాటమే చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment