ప్లాస్టిక్ వాడకం నియంత్రణకు పటిష్ట చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్లాస్టిక్ వాడకం నియంత్రించడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో స్వచ్ఛాంధ్రపై క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ఎక్కువైన నేపథ్యంలో దుష్పరిణామాలను ప్రజలకు అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ విక్రయ దుకాణదారులు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలు, వ్యాపారస్తుల నుంచి స్వచ్ఛందంగా ప్లాస్టిక్ కప్పులు, కవర్లు, గ్లాసులు సేకరించాలన్నారు. పర్యావరణ హితమైన వస్త్ర సంచులు, కాగితపు సంచులు ఏ వ్యాపారస్తులు అమ్ముతున్నారో వారిని గుర్తించాలన్నారు. వారికి కృష్ణ యోధులుగా పురస్కారాలు, ధ్రువీకరణ పత్రాలను అందజేసి సన్మానించాలన్నారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా రూపుదిద్దుకునేందుకు ప్రజలను, దుకాణదారులను ప్రోత్సహించాలన్నారు. అన్ని దుకాణాల్లో ఇకపై ప్లాస్టిక్ కవర్లు ఇవ్వరని నోటీసుబోర్డులు ప్రదర్శించాలన్నారు. కొత్తగా వ్యాపార లైసెన్సులు జారీ చేసే సమయంలో వారికి ప్లాస్టిక్ వాడకం నిషేధమన్న నిబంధన విధించాలన్నారు. వీటితో పాటు వివిధ ప్రభుత్వశాఖలు నిర్వహించే సమావేశాల్లో వాటర్ బాటిల్స్‌బదులుగా గాజు, కాగితంతో తయారుచేసిన గ్లాసులను మాత్రమే వినియోగించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, డీపీవో అరుణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment