
రసవత్తరంగా పూటీ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని దాములూరు కూడలి సంగమేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణలో కల్యాణోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న సీనియర్ విభాగం ఎడ్ల పూటీ లాగుడు పోటీలు శనివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో మొత్తం 14 జతల ఎడ్లు పాల్గొన్నట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. ఎనిమిది నిముషాల వ్యవధి, ఆరుగురు వ్యక్తులతో రెండు క్వింటాళ్ల దూరాన్ని లాగేందుకు ఎడ్ల జతలు పోటీ పడ్డాయి. అర్ధరాత్రి వరకు పోటీలు కొనసాగాయి. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జతల యజమానులకు మొమెంటోలను అందజేశారు.
జూనియర్ విభాగం విజేతలు..
సంగమేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన జూనియర్ విభాగం ఎడ్ల పూటీ లాగుడు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం సోపిరాలకు చెందిన విజయలక్ష్మి ఎడ్ల జత ఎనిమిది నిమిషాల వ్యవధిలో 3,514 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెంకు చెందిన నాని ఎడ్ల జత 3,373 అడుగులు, గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడుకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఎడ్ల జత 3,350 అడుగులు, కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం కళ్లెంవారిపాలెంకు చెందిన హనూష్‌రెడ్డి ఎడ్లజత 3,323 అడుగులు, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయికి చెందిన ప్రభాకర్ రెడ్డి ఎడ్ల జత 3,279 అడుగులు లాగి వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలను అందజేశారు. ఆరవ స్థానంలో నిలిచిన ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన శ్రీనివాసరెడ్డి ఎడ్ల జతకు ప్రత్యేక బహుమతిగా రూ.ఐదు వేలను అందజేశారు. కార్యక్రమంలో రెఫరీ నాగిరెడ్డి, సర్పంచ్ గాదెల వెంకట రామారావు, రైతు కమిటీ సభ్యులు గింజుపల్లి శ్రీనివాసరావు, సాంబశివరావు, వట్టికొండ చంద్రమోహన్, తులసీరావు, సిద్ధార్థ వీరబాబు, శ్రీరాంబ్రహ్మం, శ్రీనివాసరావు, నరసింహారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment