కృష్ణలంక(విజయవాడతూర్పు): న్యాయ విద్యార్థులు ప్రతి అంశాన్ని ఆధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, సామాజిక ఇంజినీర్లుగా వారి కర్తవ్యాలను విలువలతో నిర్వహించాలని ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్ అన్నారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఏఐఎల్‌యూ ఆధ్వర్యంలో శనివారం న్యాయ విద్యార్థుల రాష్ట్ర సదస్సు జరిగింది. ముఖ్య అతిథి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నూతనంగా వచ్చిన చట్టాలను అధ్యయనం చేయాలని, వస్తున్న మార్పులను పరిగణలోకి తీసుకుని సమాజ హితానికి ఎలా ఉపయోగ పడాలో ఆలోచించాలన్నారు. ఏఐఎల్‌యూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ న్యాయ విద్యార్థులు వారి చదువుతో పాటుగా, సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాలన్నారు. న్యాయవాదులు సంపాదన కంటే సామాజిక బాధ్యతకే ప్రాధాన్యమివ్వాలన్నారు. వీఐటీ యూని వర్సిటీ లా స్కూల్ డీన్ డాక్టర్ చక్యా బెనర్జీ మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు జరిగే ఉద్యమాలలో న్యాయ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ దివాకర్‌బాబు, గుంటూరు జె.సి.న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్.సుధాకర్ బాబు తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment