చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో తడి, పొడి చెత్త సేకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆయన మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులతో తడి, పొడి చెత్త సేకరణ, ఎంఎస్‌ఎంఈ సర్వే పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను వేరువేరుగా కాకుండా కలిపి వేస్తున్నారని దీనిపై పారిశుద్ధ్య సిబ్బందికి కూడా అవగాహన లేనట్లుగా కనిపిస్తోందన్నారు. ప్రజలతో పాటు సిబ్బందికి తగిన అవగాహన కల్పించాలన్నారు. తాను నగరంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో తడి, పొడి చెత్త సేకరణపై ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు మాత్రమే అధికారులు, పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది స్పందిస్తున్నారని, మిగతా సమయాల్లో దీనిపై దృష్టి పెట్టడం లేదన్నారు. స్వచ్ఛ జిల్లా దిశగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలన్నారు. ఎంఎస్‌ఎంఈ సర్వే పురోగతిపై మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు శ్రద్ధ పెట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో సరైన ప్రణాళికతో సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
కృష్ణా కలెక్టర్ బాలాజీ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment