
సీజనల్ వ్యాధులతో అప్రమత్తం
చిలకలపూడి(మచిలీపట్నం): దోమల వ్యాప్తి, నీటి కాలుష్యం కారణంగా ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గ్రామీణ నీటి సరఫరా, వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. దోమల వ్యాప్తి వల్ల డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలకుండా చూడాలన్నారు. నీటి కాలుష్యంతో వ్యాప్తి చెందే డయేరియా, కలరా వంటి వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయటంతో పాటు మండల, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎక్కువ కాలం నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డ్రెయిన్లలో మురుగునీరు సాఫీగా పారుదల అయ్యేలా పూడికతీత, మరమ్మతులు చేపట్టాలన్నారు. విధిగా దోమల నివారణకు మందు పిచికారీ చేయాలని సూచించారు. లీకై న తాగునీటి పైప్‌లైన్లను గుర్తించి మరమ్మతులు చేపట్టాలన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకులను నిత్యం శుభ్రపరిచి క్లోరినేషన్, బ్లీచింగ్ వేయాలన్నారు. గ్రామాల్లో సచివాలయ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఎంఎల్‌హెచ్‌పీలు నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలన్నారు. నీరు కలుషితమైనట్లు గుర్తిస్తే వెంటనే పై అధికారులకు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే పిల్లలకు అందించాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా బీసీ, సాంఘిక సంక్షేమ వసతి గృహ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల్లోని కిటికీలకు మెష్‌లను ఏర్పాటు చేయాలన్నారు. వ్యాధులను నియంత్రించటంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ ఎస్.శర్మిష్ట, జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారి నటరాజన్, బీసీ సంక్షేమాధికారి వి.రమేష్, డీపీవో జె.అరుణ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment