
బిందు సేద్యం, మల్చింగ్‌తో రైతులకు మేలు
కంకిపాడు: బిందు సేద్యం, మల్చింగ్ ప్రక్రియలతో రైతులకు మేలు చేకూరుతుందని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ డి.సుధారాణి సూచించారు. మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులు, రైతులతో కలిసి సోమవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ యాజమాన్య చర్యలు, పైరు ఎదుగుదల ఆశించిన దిగుబడుల సాధనలో కీలకం అవుతాయన్నారు. సాగు ఖర్చులు తగ్గించుకుంటూ నూతన విధానాలను అవలంబించాలని సూచించారు. శాస్త్రవేత్త డాక్టర్ వి.మంజువాణి మాట్లాడుతూ బిందు సేద్యం, మల్చింగ్‌తో రైతులకు అధిక లాభాలు ఉన్నాయన్నారు. నీరు 40 శాతం–70 శాతం వరకూ ఆదా అవుతుందన్నారు. మొక్కల ఉత్పాదకత, నాణ్యతకు దోహదపడుతుందన్నారు. కలుపు సమస్య, ఎరువు ఖర్చు 30 శాతం ఆదా అవుతుందన్నారు. మల్చింగ్‌తో నేల నాణ్యత వృద్ధి చెంది ఆశించిన దిగుబడులు లభిస్తాయన్నారు. కంకిపాడు ఉద్యానశాఖ అధికారి చందు జోసఫ్ సుందరం మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీపై బిందు సేద్యం యూనిట్ లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి పీఎం కిరణ్, వీఏఏ విజయ్, రైతులు పాల్గొన్నారు.
ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ డి.సుధారాణి, శాస్త్రవేత్త డాక్టర్ వి.మంజువాణి
Comments
Please login to add a commentAdd a comment