
రాష్ట్రస్థాయి ఔషధ మొక్కలపై అవగాహన సదస్సు
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ మంజుల డీ హోసమని ఆదేశాల మేరకు సోమవారం గాంధీనగర్‌లో రాష్ట్రస్థాయి ఔషధ మొక్కల పంటల కొనుగోలుదారులు, అమ్మకం దారుల అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆయుష్ డిపార్ట్‌మెంట్, హోమియోపతి అదనపు డైరెక్టర్ డాక్టర్ సుజాత, ఏపీఈడీఏ సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ పెద్ద స్వామి, సీనియర్ సైంటిస్ట్ కేవీఎన్ సత్య శ్రీనివాస్, డాక్టర్ బృందావనం, కళ్యాణ్ బాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రైతులకు, ఔషధ మొక్కల పంటలను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలో వివరించారు. ఔషధ మొక్కల స్టాల్ ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రైతులకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. రైతులు పండించే పంటలపై మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించినట్లు చెప్పారు. ఔషధ మొక్కల సాగు, పంటలు పండించే విధానంతోనే అత్యధిక దిగుబడి సాధించి లాభాలు పొందవచ్చని రైతులకు సూచించారు. జాతీయ ఔషధ మొక్కల బోర్డు, న్యూఢిల్లీ వారి సహకారంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆయుష్ శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ సుజాత స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన రైతులు, అమ్మకందారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడిసినల్ అండ్ ఆటోమేటిక్ ప్లాంట్ బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment