
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి
చిలకలపూడి(మచిలీపట్నం): రానున్న వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం గ్రామీణ నీటి సరఫరా, మునిసిపల్, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మచిలీపట్నం, పెడన మునిసిపాలిటీలకు తరకటూరు స్టోరేజీ నుంచి తాగునీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏప్రిల్ నెలలో కాలువలకు నీటిని విడుదల చేసినప్పుడు పూర్తిస్థాయిలో చెరువులను నింపాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్లతో తాగునీటిని అందించాలన్నారు. గుడివాడలోని టిడ్కో గృహ సముదాయాలకు సరఫరా చేస్తున్న నీరు సరిపోవటం లేదని నీటి వనరులను పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ స్పందిస్తూ సమస్య తలెత్తకుండా అదనంగా ట్యాంకర్లతో సరఫరా చేయాలని సూచించారు. సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా అధికారి నటరాజ్, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, సీపీవో గణేష్‌కృష్ణ, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment