
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ నెల ఎనిమిదో తేదీన ఘనంగా నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో మహిళా దినోత్సవంపై చర్చించారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. మహిళా సాధికారతను చాటేలా మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలకు తగిన గౌరవం, గుర్తింపు వచ్చేలా సన్మానాలు, ప్రేరణాత్మక అనుభ వాలను పంచుకునే విధంగా చర్చలు తీసుకోవాలని పేర్కొన్నారు. వేడుకల్లో ఆయా శాఖలకు సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. బందరు డీఎస్పీ చప్పిడి రాజా, మెప్మా పీడీ పి.సాయిబాబు, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ బాపి రాజు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శర్మిష్ట, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment