
ఉద్యోగుల సమస్యలపై అలుపెరగని పోరాటం
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాము
పెడన: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర, జిల్లా స్థాయిలో అలుపెరగని పోరాటాలు చేస్తోందని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.రాము అన్నారు. గుడి వాడ రోడ్డులోని స్థానిక షాదీఖానాలో వార్డు సచివాలయ ఉద్యోగులతో జిల్లా సంఘ నాయకులు సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ హోదాలు, శాఖల పరంగా అనేక సంక్షేమ సంఘాలు ఉన్నాయని, వాటన్నింటినీ కలుపుకొని 2010లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏర్పాటయిందన్నారు. ప్రతి ఉద్యోగికి ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు అందించడమే లక్ష్యంగా సంఘం కృషి చేస్తోందన్నారు. కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం రెండేళ్లు గడువు కోరడంతో ఉద్యోగుల సమస్యలపై ఆ సమయం ఇచ్చామన్నారు. సంఘ జిల్లా కార్యదర్శి టి.వి.వి.వి.వర ప్రసాద్ మాట్లాడుతూ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు సరైన జాబ్‌చార్ట్ లేదన్నారు. అలాగే ఉద్యోగోన్నతులు కూడా లభించని ఉద్యోగాలలో బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని, వీరికి కూడా ఉద్యోగోన్నతి కల్పించాలనే డిమాండ్ ఉందన్నారు. అనంతరం సంఘ నాయకులు ఏపీజీఈఏ డైరీ – 2025ని ఆవిష్కరించారు. జిల్లా నాయకులు సింహాద్రి రాంబాబు, పి.వి.పరమేశ్వరరావు, గొల్లపూడి శ్రీనివాసరావు, కె.లోకేశ్వరరావు, ఎస్.వి. వి.రామారావు, కె.కోటేశ్వరరావు, కె.వి.వి.దుర్గా ప్రసాద్, పెడన ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment