చిలకలపూడి(మచిలీపట్నం): ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం గ్రూప్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. లెక్కలు, సివిక్స్, బోటనీ పరీక్షలకు 25,319 మంది విద్యార్థులకు 23,808 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 963 మందికి 916 మంది విద్యార్థులు హాజరయ్యారు.
కేంద్రీయ విద్యాలయం అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
మధురానగర్(విజయవాడసెంట్రల్): కేంద్రీయ విద్యాలయం నంబర్–1 విజయవాడలో 2025 – 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఎస్. ఆదిశేషు శర్మ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతి, బాలవాటిక–3లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొ న్నారు. శుక్రవారం ఉదయం పది గంటల నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31వ తేదీ నాటికి ఆరేళ్లు నిండి ఎనిమిదేళ్ల లోపు ఉండాలని, బాలవాటిక–3లో ప్రవేశాలకు ఐదేళ్లు నిండి ఏడేళ్ల లోపు వయస్సు ఉండాలని స్పష్టంచేశారు. ఆసక్తి కల వారు ఈ నెల 21వ తేదీ రాత్రి పది గంటల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీస్ నంబర్లు మార్పు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పరిపాలన సౌలభ్యం దిశగా ఈస్‌కోస్ట్ రైల్వే నిర్వహణలో నడుస్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసు నంబర్లను మార్పు చేసినట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 17488 సర్వీసు నంబర్‌తో నడిచే విశాఖపట్నం – కడప ఎక్స్‌ప్రెస్ ఇక 18521 నంబరుతో నడుస్తుంది. 17487 నంబరు కడప – విశాఖపట్నం రైలు 18522 నంబరుతో, 22701 నంబర్ విశాఖపట్నం – గుంటూరు రైలు 22875 నంబరుతో, 22702 నంబర్ గుంటూరు – విశాఖపట్నం 22876 నంబరుతో, 20896 నంబర్ భువనేశ్వర్ – రామేశ్వరం రైలు 20879 నంబరుతో, 20895 నంబర్ రామేశ్వరం – భువనేశ్వర్ రైలు 20850 నంబరుతో, 12898 నంబర్ భువనేశ్వర్ – పుదుచ్చేరి రైలు 20851 నంబరుతో, 12897 నంబర్ పుదుచ్చేరి – భువనేశ్వర్ రైలు 20852 నంబరుతో, 12830 నంబర్ భువనేశ్వర్ – చైన్నె సెంట్రల్ రైలు 20853 నంబరుతో, 12829 నంబర్ చైన్నె సెంట్రల్ – భువనేశ్వర్ రైలు 20854 నంబరుతో నడవన్నాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ కోరారు.
రేపటి నుంచి హెల్త్ వర్సిటీ పురుషుల గేమ్స్ మీట్
గన్నవరం రూరల్: మండలంలోని చిన అవుటపల్లిలో ఉన్న డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఎనిమిది నుంచి 17వ తేదీ వరకూ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో 26వ పురుషుల ఇంటర్ మెడికల్ కాలేజ్ గేమ్స్ మీట్ జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.భీమేశ్వర్ గురువారం తెలిపారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమంలో భాగంగా కళాశాల క్రీడా మైదానంలో జరిగే గేమ్స్ మీట్‌ను యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు రాజయ్య, కార్యదర్శి లక్ష్మణరావు, డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు, అకాడమీ ప్రతినిధులు, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి తదితరులు పాల్గొంటారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment