పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి
ఔత్సాహికులకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పిలుపు
మచిలీపట్నంటౌన్: పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన వారికి రుణాల మంజూరులో బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలని సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శుభం కన్వెన్షన్ హాల్లో మెగా ఎంఎస్‌ఎంఈ ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనకు కృష్ణాజిల్లా అనువైన ప్రాంతమని, బ్యాంకర్లు కూడా విరివిగా రుణాలు అందించేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సులభతరమైన ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో ఈ ప్రాంతం మరింత పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల స్థాపన ద్వారానే అభివృద్ధి చెందాయన్నారు. అతి చిన్న దేశమైన ఇజ్రాయిల్ 1948వ సంవత్సరం నుంచి నేటి వరకు పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ముఖ్యంగా ఏరోనాటికల్ సెక్టార్‌లో తిరుగులేని ఆధిపత్యం వహిస్తోందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా బలోపేతం కావడంతోనే కాకుండా యువతకు విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో దోహదపడతారని కలెక్టర్ బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూ.85 కోట్ల రుణాలను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మహిళా శక్తి సంఘాలకు కలెక్టర్ బాలాజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ డెవలప్‌మెంట్ జీఎం తలశిల కామేశ్వరరావు, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, జోన్ హెడ్ సి.వి.ఎన్.భాస్కరరావు, మెప్మా పీడీ పి.సాయిబాబు, ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ ఆర్.వెంకట్రావు, యూబీఐ రీజనల్ హెడ్ కె.వెంకట్రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment