విజయవాడ సమగ్రాభివృద్ధికి చర్యలు
ఎంపీ కేశినేని శివనాథ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి అవసరమైన సవివర ప్రాజెక్టుల నివేదికలు రూపొందించేందుకు అధికారులు కృషి చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో రహదారులు, భవనాలు విజయవాడ నగరపాలక సంస్థ, రెవెన్యూ శాఖల అధికారులతో ఎంపీ సమావేశం నిర్వహించారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాల పరిధిలో భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. నగరంలో భవిష్యత్‌లో ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఎదురుకాకుండా ఏర్పాటు చేయాల్సిన పార్కింగ్ స్థలాలు, వంతెనలు, జంక్షన్ల అభి వృద్ధి, ప్రత్యామ్నాయ రహదారులు, రహదారుల అనుసంధానం తదితరాలపైనా చర్చించారు. రివర్ బండ్ సుందరీకరణ, హిల్స్ రెయిలింగ్, కాళేశ్వరరావు మార్కెట్ జంక్షన్ సుందరీకరణ, గాంధీ హిల్ అభివృద్ధి, కేదారేశ్వరరావుపేట–టన్నెల్ రహదారి విస్తరణ, చిట్టినగర్ జంక్షన్ సుందరీకరణ, వాటర్ ఫౌంటేన్‌తో సితార జంక్షన్ సుందరీకరణ, టన్నెల్ – గొల్లపూడి 200 అడుగుల రహదారి సుందరీకరణ, కృష్ణలంక కట్ట సుందరీకరణ, వాక్‌వేలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. ఈ అంశాలకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు, అంచనాలు, డీపీఆర్‌లు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికలో భాగంగా మూడు నియోజకవర్గాల పరిధిలో సైక్లోన్ సెంటర్ల ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, వీఎంసీ సూపరింటెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్టులు) సి.సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment