వక్ఫ్ భూములు.. ఇక ఫట్!
కోర్టు ఆదేశించినా చర్యలు శూన్యం
● ఎన్నికల కోడ్ ముగిసినా వేలం నిర్వహణలో జాప్యం ● భూముల్లో అక్రమంగా సాగు చేస్తున్న ‘పచ్చ’నేతలు ● తాజాగా ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం పావులు
పెనమలూరు: అత్యంత విలువైన వక్ఫ్ భూములు పచ్చనేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. భూములకు కౌలు వేలం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా.. నేటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. తాజాగా వక్ఫ్ భూములు ఏపీఐఐసీకి కట్టపెట్టడానికి ప్రభుత్వం సైతం కన్నేయటంతో అత్యంత విలువైన వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ విషయం..
కొండపల్లి ఖాజీ సర్వీసుకు చెందిన వక్ఫ్ భూములు తాడిగడప, పెదపులిపాక గ్రామాల్లో ఉన్నాయి. తాడిగడపలో ఆర్‌ఎస్ నంబర్ 79,173,179లలో 30.04 ఎకరాలు, పెదపులిపాకలో ఆర్‌ఎస్ నంబర్ 87లో 12.82ఎకరాల భూమి ఉంది. బహిరంగ మార్కెట్‌లో వీటి ధర రూ. 350 కోట్లకు పైగా పలుకుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఒక వ్యక్తి చేతిలో ఈ భూములు ఉండటంతో ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దీంతో వక్ఫ్ అధికారుల్లో కదలిక వచ్చింది. వక్ఫ్ భూములు సాగు కౌలు వేలం నిర్వహించటానికి జిల్లా అధికారుల దృష్టికి జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆడిట్ వక్ఫ్ తీసుకువెళ్లారు.
వేలంనకు ఆదేశాలు..
కాగా వక్ఫ్ భూములకు వేలంపాట నిర్వహించటానికి మండల తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. జనవరి 31వ తేదీన వేలంపాట నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ లోగా భూముల్లో ఉన్న వ్యక్తి వేలం ఆపటానికి హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సైతం వేలం నిర్వహించాలని ఆదేశించింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో అధికారులు వేలం వాయిదా వేశారు. తెరవెనుక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వేలం వాయిదా పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
వక్ఫ్ భూముల్లో అక్రమంగా సాగు..
కాగా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పచ్చ నేతలు కొందరు వక్ఫ్ భూముల్లోకి ప్రవేశించి అక్రమ సాగు చేపట్టారు. దీనిపై జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆడిటర్ వక్ఫ్ రాత పూర్వకంగా రెవెన్యూ అధికారులకు, పెనమలూరు పోలీసులకు 15 మందిపై జనవరి 25వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే జిల్లా అధికారులు కాని, పోలీసులు కాని ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాలు కాని, ఎన్నికల కోడ్ కాని ఆక్రమణదారులను అడ్డు రాలేదు. వక్ఫ్ భూముల్లో ఆక్రమణదారులు చట్ట విరుద్ధంగా సాగు చేస్తున్నారు. నేటికీ ఆక్రమణదారులపై అధికారులు చర్యలు తీసుకోకపోవటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారిందని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసినా వేలంపాటకు చర్యలు ఏవని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తెరపైకి ఏపీఐఐసీ..
పచ్చనేతలతో పాటు, ప్రభుత్వం కూడా వక్ఫ్ భూములపై కన్నేసినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు పంటసాగు పై వేలంపాట వేయాల్సి ఉండగా నేటికీ అది జరగలేదు. పైగా అత్యంత విలువైన వక్ఫ్ భూములను దీర్గకాలం లీజుపై ఏపీఐఐసీకి ధారాదత్తం చేయటానికి అఽధికారులు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఒక పక్క పచ్చగద్దలు వక్ఫ్ భూమిలో అక్రమంగా సాగు చేస్తుంటే, మరో పక్క ఏపీఐఐసీ పేరుతో విలువైన వక్ఫ్ భూములకు ఎసరుపెట్టే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
కోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేయాలి
వక్ప్ భూములకు బహిరంగ కౌలు వేంపాట నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు వెంటనే అమలు చేయాలని ముస్లిం మైనారిటీ నేతలు కోరుతున్నారు. అలాగే ఏపీఐఐసీకి వక్ఫ్ భూములు ఇవ్వాలని వచ్చిన ప్రతిపాదన సరైంది కాదని ఖండిస్తున్నారు. వక్ఫ్ భూములు పూర్తిగా వక్ఫ్ ఆధీనంలో ఉండాలని, భూములపై వచ్చే ఆదాయం కేవలం ముస్లిం మైనారిటీల సంక్షేమానికే ఉపయోగించాలని కోరుతున్నారు. వక్ఫ్ భూములపై వచ్చే ఆదాయంతో వక్ఫ్ బోర్డు ఆర్థికంగా బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. వక్ఫ్ అధికారులు భూములు ఆక్రమించిన వారిపై కోర్టు ధిక్కార కేసు వేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం చిత్తశుద్ధితో వక్ఫ్ భూములకు కౌలు వేలం నిర్వహించి పచ్చ నేతల నుంచి భూములు కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.అత్యంత విలువైన వక్ఫ్ భూముల పరిస్థితి నేడు ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment