అబద్ధాల బాబు...చంద్రబాబు
పెడన: ఎన్నికలకు ముందు చేనేత రంగాన్ని పరిరక్షిస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు నేడు అందుకు విరుద్ధంగా నడుచుకుంటూ అబద్ధాల బాబుగా మారారని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివదుర్గారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం శుక్రవారం కృష్ణాజిల్లా పెడనలో జరిగింది. ఈ సమావేశానికి ముందు రాష్ట్ర కమిటీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శివదుర్గారావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని కాపాడాల్సింది పోయి జీఎస్టీ అధికంగా వేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి బడ్జెట్‌లో నామమాత్రంగా నిధులు కేటాయించిందన్నారు. చేనేత కార్మికులు తీవ్ర అప్పుల సంక్షోభంలో కూరుకుపోయి, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిని ఆయా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని ధ్వజమెత్తారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ మాట్లాడుతూ బడ్జెట్‌లో కార్మికులకు రూ.5కోట్లు విడుదల చేసి ఖర్చుపెట్టామని చేనేత శాఖ మంత్రి సబితమ్మ శాసనసభను పక్కదారి పట్టించారని ధ్వజమెత్తారు. ఎక్కడ, ఎవరికి ఖర్చుపెట్టారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. చేతివృత్తుల సమన్వయ కమిటీ కన్వీనర్ మున్నూరు భాస్కరయ్య మాట్లాడుతూ ఒక్క చేనేత రంగాన్ని కాకుండా అన్ని వృత్తుల వారిని నమ్మించి దగా చేసిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై త్వరలోనే ఉద్యమం చేస్తామన్నారు. అన్ని వృత్తుల వారిని ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమబాట పట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో సంఘం కృష్ణాజిల్లా కార్యదర్శి గోరు రాజు, అధ్యక్షుడు వాసా గంగాధరరావు, నందం చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
కాటికాపరుల సమస్యలపై 11న మహాధర్నా
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): శ్మశానంలో గుంతలు తీసి, శవాలను పూడ్చి, కాల్చే కాటికాపరుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 11న ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ప్రదర్శన, మహాధర్నాను నిర్వహించనున్నామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి చెప్పారు. విజయవాడ నగరంలోని సున్నపుబట్టీల సెంటర్‌లో ఉన్న పూలే, అంబేడ్కర్ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాల్యాద్రి మాట్లాడుతూ 11న రైల్వేస్టేషన్ నుంచి అలంకార్ సెంటర్ వరకు ప్రదర్శన, అనంతరం ధర్నా చౌక్‌లో ధర్నా జరుగుతుందని చెప్పారు. ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాన్ని సంఘం సభ్యులు ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె నటరాజ్, సహాయ కార్యదర్శి జి.క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
ఎన్నికలకు ముందు చేనేత రంగాన్ని పరిరక్షిస్తామని హామీలు బడ్జెట్‌లో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేటాయింపులు వృత్తిదారులను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమబాట పడతాం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివదుర్గారావు
అబద్ధాల బాబు...చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment