కదులుతున్న డొంక! | - | Sakshi
Sakshi News home page

కదులుతున్న డొంక!

Published Sat, Mar 8 2025 2:22 AM | Last Updated on Sat, Mar 8 2025 2:18 AM

కదులుతున్న డొంక!

కదులుతున్న డొంక!

ప్రత్యేక కమిటీ ముందుకు ‘ఆ ముగ్గురు’!

దుర్గమ్మ చీరల విభాగంలో 2018 నుంచి 2023 వరకు బాధ్యతలు నిర్వర్తించిన వారిలో సుబ్రహ్మణ్యం, చెన్నకేశవరావు, రమేష్‌ కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. 2018 నుంచి 2019 వరకు చీరల వ్యవహారంలో గోల్‌మాల్‌ జరగగా, ఆ సమయంలో సుబ్రహ్మణ్యం విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత చీరల విభాగానికి వచ్చిన మిగిలిన వారు పాత రికార్డులను పట్టించుకోకుండా, తాము బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన చీరల వివరాలను మాత్రమే రికార్డులలో పొందుపరిచారు. తాజాగా ప్రత్యేక కమిటీ ఆ ముగ్గురు ఉద్యోగులను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీరల గోల్‌మాల్‌ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం కూటమి నేతల పంచన చేరారు. కూటమి మంత్రి చేత మాట్లాడించి ప్రత్యేక కమిటీ ముందు హాజరు కాకుండా ఉండేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు చెందిన ఓ మంత్రి సాయంతో ఈ వ్యవహారం నుంచి బయట పడాలని చూస్తున్నట్లు సమాచారం.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో చీరల స్కామ్‌పై శుక్రవారం ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం 5వ అంతస్తులోని చీరల విభాగంలో దేవదాయ శాఖ గుంటూరు డెప్యూటీ కమిషనర్‌ కేబీ రావు పర్యవేక్షణలో మొత్తం ముగ్గురు ఏసీలు విచారణ చేపట్టారు. దేవస్థాన పరిపాలనా విభాగం, లీజెస్‌ సెక్షన్‌తో పాటు చీరల విభాగానికి చెందిన ఉద్యోగులు ప్రత్యేక కమిటీ బృందం ముందు హాజరయ్యారు. చీరల స్కామ్‌ జరిగినప్పటి రికార్డులను ఇవ్వాలని వారు కోరగా, వాటితో పాటు తాను గతంలో చేసిన విచారణ తాలుకూ రిపోర్డును ఏఈవో సుధారాణి ప్రత్యేక కమిటీకి అందజేశారు.

అసలు విషయం ఏమిటంటే..

2018 నుంచి 2019 వరకు చీరల వ్యవహారంలో గోల్‌మాల్‌ జరిగినట్లు గతంలోనే గుర్తించారు. మొత్తం రూ. 2కోట్ల విలువైన 33,686 చీరలు మాయం కాగా వాటి స్థానంలో నాసిరకం, నాణ్యత లేని చీరలను ఉంచినట్లు గుర్తించారు. అయితే చీరల స్కామ్‌ జరిగినప్పుడు ఎవరెవరూ ఆ విభాగంలో విధులు నిర్వర్తించారు.. ఆ తర్వాత ఎవరు బాధ్యతలు తీసుకున్నారనే దానిపై దేవస్థాన పరిపాలనా విభాగం నుంచి రికార్డులను తెప్పించుకుని కమిటీ పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన విచారణలో చీరల విభాగంలో విధులు నిర్వర్తించిన పలువురు ఉద్యోగులు ప్రత్యేక కమిటీ ముందు హాజరై వివరాలను వెల్లడించారు. సెక్షన్‌ బాధ్యతలు తమపై ఉన్నా.. భక్తులు సమర్పించిన చీరలు, కౌంటర్‌లో అమ్మకాలు, చీరల నిల్వ వంటి అంశాలన్నీ గుమాస్తాల పర్యవేక్షణలో జరిగాయని తెలియజేశారు. శనివారం కూడా ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.

అధికారి మెప్పు కోసమేనా!

2018 నుంచి 2019ల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఆ సమయంలో సుబ్రహ్మణ్యం ఉన్నతాధికారుల మెప్పు కోసమే చీరలను గోల్‌మాల్‌ చేసినట్లు అప్పట్లో దుర్గగుడిలో ప్రచారం జరిగింది. కొంత మంది అధికారులు, అప్పటి ప్రజాప్రతినిధులకు భారీ ఖరీదైన పట్టు చీరలను సమర్పించి, వాటి స్థానంలో నాసిరకం, తక్కువ రేటు ఉన్న చీరలను ఉంచినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దుర్గమ్మ చీరల స్కామ్‌లో విచారణ చేపట్టిన ప్రత్యేక కమిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement