బుడమేరు డైవర్షన్ కెనాల్ పరిశీలన
జి.కొండూరు: గత ఏడాది ఆగస్టులో బుడమేరుకు వచ్చిన వరదల కారణంగా కవులూరు గ్రామ శివారులోని బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు గండ్లు పడిన ప్రాంతాన్ని, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్‌ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 6వ తేదీన సాక్షి ప్రచురించిన ‘బుడమేరకు పొంచి ఉన్న కడగండ్లు’ కథనానికి స్పందించి ఆయన ఈ పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట డైవర్షన్ కెనాల్‌కు గండ్లు పడి పూడ్చిన ప్రదేశంలో ఊట వస్తున్న ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైపన్‌ల వద్ద కట్ట బలోపేతంపై అధికారులతో చర్చించారు. అనంతరం వెలగలేరు హెడ్‌రెగ్యులేటర్ వద్ద గేట్లను పరిశీలించారు. సమస్య ఉన్న గేట్లకు చేపట్టవలసిన మరమ్మతులపై ఆరా తీశారు. వరదల కారణంగా బుడమేరు, పులివాగుతో పాటు పలు వాగులకు పడిన గండ్లు, మేజర్, మైనర్ ఇరిగేషన్ చెరువులు వాటికి పడిన గండ్లపై అధికారులు, రైతులతో చర్చించారు. రైతులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో అనుమతి రాగానే పనులు ప్రారంభించి వర్షాకాలంలోపు పనులను పూర్తి చేస్తామని అధికారులు కలెక్టర్‌కు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.
బుడమేరు డైవర్షన్ కెనాల్ పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment