అర్చకత్వానికి అంకితం
ఘంటసాల: మహిళలు అన్ని రంగాలలో ముందుంటూ వారసత్వాన్ని, కుటుంబ బాధ్యతలను స్వీకరించడంలో చాలా దృఢ నిశ్చయంతో కొనసాగుతున్నారు అనడానికి నిదర్శనం ఘంటసాల విజయలక్ష్మి, ఆమె సోదరీమణులు లక్ష్మి, మాధవీలత. ఘంటసాలలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వరస్వామి దేవాలయం, శ్రీ బాల పార్వతీ సమేత జలధీశ్వరస్వామి దేవాలయాల్లో శతాబ్దాలుగా వంశపారంపర్య అర్చకత్వం కొనసాగుతోంది. ఈ పరంపరలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు ఘంటసాల వెంకటేశ్వరరావుకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం ఉన్నారు. వారు ఉన్నత విద్యనభ్యసించారు. ఆయన తదనంతరం కుటుంబంలో పురుషులు లేకపోవడంతో ఆడ పిల్లలు తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి ముందుకు వచ్చారు. 1981లో ఘంటసాల వెంకటేశ్వరరావు కాలం చేయగా.. వారి కుమార్తెలు అర్చకత్వ బాధ్యతలు చేపట్టారు. వీరిలో ముఖ్యంగా ఘంటసాల విజయలక్ష్మి పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడీ చేసినప్పటికీ ఆ రంగాన్ని వదిలి అర్చకత్వ పరీక్షలలో ఉత్తీర్ణురాలై, అవివాహితగా ఉండి తన జీవితాన్ని సంపూర్ణంగా అర్చకత్వానికి అంకితం చేశారు. శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంతో పాటు సుమారు ఏడేళ్లు శ్రీ జలధీశ్వర స్వామి దేవాలయంలో కూడా విజయలక్ష్మి అర్చకత్వం చేశారు. ఈమెకు వారి సోదరిలు లక్ష్మి, మాధవీలతలు కూడా సహకారం అందించే వారు. ఘంటసాల చుట్టు పక్కల ప్రాంతాల్లో శుభకార్యాలు కూడా వీరే చేయించడం ఓ ప్రత్యేకత.
Comments
Please login to add a commentAdd a comment