రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Published Sun, Mar 9 2025 2:39 AM | Last Updated on Sun, Mar 9 2025 2:39 AM

రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్‌ 1లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. దీన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ రాజా సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, ఒంటిపై నీలం, ఆకుపచ్చ గళ్ల లుంగీ, కాషాయం రంగు టీ షర్ట్‌ ధరించి ఉన్నాడని, కుడి చేతిపై శివుని బొమ్మతో పచ్చ బొట్టు ఉందని, ఇతర ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. అనారోగ్యంతో మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. వివరాలకు విజయవాడ జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని కోరారు.

రైలు ఢీ కొని..

కోనేరుసెంటర్‌: రైలు ఢీ కొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన శనివారం బందరు మండలం బొర్రపోతుపాలెం రైల్వేగేటు సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బందరు మండలం బొర్రపోతుపాలెం గ్రామానికి చెందిన కాగిత శివనాగరాజు(38) కూలి పనులు చేస్తుంటాడు. కొంతకాలం క్రితం భార్య చనిపోయింది. భార్య చనిపోవటానికి నాగరాజు కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు పెట్టిన కేసులో సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తూ కొద్ది రోజుల క్రితం బయటికి వచ్చాడు. అప్పటి నుంచి నాగరాజు మానసికస్థితి సరిగా ఉండటంలేదు. ఇదిలా ఉండగా నాగరాజు బహిర్భూమికి ప్రతి రోజు రైల్వేట్రాక్‌ వద్దకు వెళ్తుంటాడు. అలాగే శనివారం ఉదయం రైల్వేట్రాక్‌ వైపు బహిర్భూమికి వెళ్లిన నాగరాజు ఇంటికి తిరిగిరాలేదు. మధ్యాహ్నం గ్రామస్తులు ట్రాక్‌ పక్కన శవంగా పడి ఉన్న అతడిని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతుని వివరాలు సేకరించారు. మృతుడు నాగరాజును రైలు ఢీకొనడంతో చనిపోయినట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు రైల్వే పోలీసు సురేష్‌ తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్‌ఐసీ బిల్డింగ్‌ పక్కన ఉన్న బస్టాప్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించామని స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అడపా నాగమురళి శనివారం తెలిపారు. మృతుడి వయసు 45 ఏళ్లు ఉంటాయని, అనారోగ్యంతో చనిపోయాడన్నారు. వివరాలకు గవర్నర్‌పేట పీఎస్‌(0866 2576023)లో సంప్రదించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement