
సుబాబుల్ ట్రాక్టర్ ఢీకొని బాలుడి దుర్మరణం
నందిగామరూరల్: సుబాబుల్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొని బాలుడు దుర్మరణం చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని లింగాలపాడు గ్రామానికి చెందిన నగిరికంటి రవీంద్ర కుమారుడు జోగేంద్ర(8) గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు శనివారం సెలవు కావటంతో తన అక్కతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై మిర్చి బస్తాలు వేసుకుని వస్తున్నాడు. ఈ క్రమంలో లింగాలపాడు గ్రామ శివారులోకి వచ్చే సరికి మిర్చి బస్తాల వాహనం వీరికి తగలటంతో బాలుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. అదే సమయంలో అటుగా వస్తున్న సుబాబుల్ ట్రాక్టర్ బాలుడి తలపైకి ఎక్కటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్, మిర్చి బస్తాలు వేసుకువస్తున్న ద్విచక్ర వాహనదారుడు అక్కడి నుంచి పరారయ్యారు. ఎస్‌ఐ అభిమన్యు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment