
అయోమయం.. అగమ్యగోచరం
ప్రశ్నార్థకంగా ‘ఓపెన్’ విద్యార్థుల భవిష్యత్తు
మధురానగర్(విజయవాడసెంట్రల్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్‌లకు నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రం వద్ద సోమవారం విద్యార్థులు యూనివర్సిటీ సేవలు రాష్ట్రంలో కొనసాగించాలని కోరుతూ నిరసన ధర్నా నిర్వహించారు.
సేవలు నిలిపివేత..
పలువురు విద్యార్థులు మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం పదేళ్లు పూర్తయిన దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీ సేవలు అకస్మాత్తుగా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో యూనివర్సిటీలో నమోదు చేసుకుని కోర్సులు పూర్తికాని సుమారు రెండు లక్షల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇంకొక సెమ్ పూర్తయితే చేతికి డిగ్రీ పట్టా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న తమకు అసలు పరీక్షలు జరుగుతాయో
లేదో డిగ్రీ చేతికి వస్తుందో రాదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందని
వాపోయారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
అధికారులు చొరవ చూపితే..
ఏటా సుమారు 35 వేల మంది ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యనభ్యసిస్తున్నారని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు డిగ్రీ దూరమయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి వీసీని నియమించి అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం విద్యార్థులలో 90 శాతం మంది బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థులు, 48 శాతం మహిళలు ఉన్నారని తెలిపారు.
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ సేవలను నిలిపివేసిన తెలంగాణ విజయవాడ ప్రాంతీయ అధ్యయన కేంద్రం వద్ద విద్యార్థుల నిరసన ఏపీలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్
డిగ్రీ చేసే అవకాశం పోతోంది..
నేడు ఏ చిన్న ఉద్యోగం చేయాలన్నా డిగ్రీ కావాల్సి ఉంది. ఉద్యోగం చేసుకుంటూ, ఇంట్లో వారిని ఒప్పించి మరీ డిగ్రీ చేసేందుకు చదువుకుంటున్నా. ఇప్పటికీ 5 సెమ్‌లు పూర్తయి ఆరో సెమ్ జూన్ జూలై నెలలో నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీలో తమ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించటంతో పరీక్షలు జరుగుతాయో లేదో తెలియటం లేదు. అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వక పోవటంతో ఇంట్లో ఉంటూ డిగ్రీ పూర్తి చేయాలని అనుకునే వారికి ఆ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది.
– కె.అనిత, అజిత్‌సింగ్‌నగర్

అయోమయం.. అగమ్యగోచరం
Comments
Please login to add a commentAdd a comment