అరకొర పింఛన్లే గతి | - | Sakshi
Sakshi News home page

అరకొర పింఛన్లే గతి

Published Tue, Mar 11 2025 1:37 AM | Last Updated on Tue, Mar 11 2025 1:36 AM

అరకొర

అరకొర పింఛన్లే గతి

గుడ్లవల్లేరు: కూటమి ప్రభుత్వంలో పూటకొకటి, రోజుకొకటి అన్నట్లు ఇష్టారాజ్యంగా సర్వేలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో 497 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లోని అన్ని సచివాలయాల పరిధిలో సర్వేలు కొనసాగుతున్నాయి. ఈ సర్వేలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజల నుంచి పూటకో వివరం రాబట్టాలని సచివాలయ సిబ్బందితో ప్రభుత్వం ఆడుకుంటోంది.

ఎనర్జీ అసిస్టెంట్లు మినహా..

గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చింది. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ నియమించి, రెండు వేల ఇళ్లకు ఒక సచివాలయం చొప్పున ఏర్పాటు చేసింది. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పని చేస్తూ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకే చేరవేసేవారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లను తొలగించారు. గత ప్రభుత్వంలో నెలలో కనీసం రెండు, మూడు సంక్షేమ పథకాలైన అమలయ్యేవి. వాటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ తొమ్మిది మాసాల్లో పింఛన్లు మినహా మరే సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు. దీనితో ప్రభుత్వం ఉద్యోగులు, సిబ్బందిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక నానా రకాల సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎనర్జీ అసిస్టెంట్లు మినహా మిగిలిన సెక్రటరీలు సహా అందరితో ఈ సర్వేలు చేయిస్తున్నారు.

పీ–4 సర్వేతో ప్రజలకు ఇక్కట్లు

పీ–4 సర్వే, వర్క్‌ ఫ్రం హోం సర్వే, ఎంఎస్‌ఎంఈ సర్వే, చిల్డ్రన్‌ బర్త్‌ సర్వే, నాన్‌ రెసిడెంట్స్‌ సర్వేలు ఒకేసారి చేయిస్తున్నారు. పీ–4 సర్వేలో ఎంపిక చేసిన వారి ఇంటికి వెళ్లి వారికి కారు, ఏసీ వంటివి ఉన్నాయా? ఎన్ని ద్విచక్ర వాహనాలు ఉన్నాయి? ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా? వంటి వివరాలు అడుగుతున్నారు. పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత సెల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని సచివాలయ సెక్రటరీకి చెప్పాల్సి ఉంటుంది.

వర్క్‌ ఫ్రం హోమ్‌నీ వదలని వైనం

సర్వేల్లో వర్క్‌ ఫ్రం హోమ్‌ను కూడా వదలకుండా చేస్తున్నారు. వర్క్‌ ఫ్రం హోం సర్వేలో ఎవరి ఇంట్లోనైనా ఐటీ సిబ్బంది. సాఫ్ట్వేర్‌ ఇంజినీర్లు వర్క్‌ ఫ్రం హోం చేస్తే వారి వివరాలు నమోదు చేయాల్సిందే. ఎంఎస్‌ఎంఈ సర్వేలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, వాటి యజమానులు ఎవరు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు తది తర వివరాలను సేకరిస్తున్నారు.

సర్వేలతో ప్రజలకు విసుగు

ఈ సర్వేల్లో ఆరాలతో ప్రజలు విసుగు చెందుతూ ఇబ్బందులు పడుతున్నారు. రుణం ఏమైనా కావాలా? వంటి వివరాలు కూడా సర్వేల్లో అడగటం కొన్ని చోట్ల జరుగుతోంది. చిల్డ్రన్‌ బర్త్‌ సర్వేలో పుట్టిన బిడ్డకు బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకు న్నారా, ఆధార్‌ కార్డు చేయించారా, ఎందుకు చేయించలేదు అంటూ వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక నాన్‌ రెసిడెంట్స్‌ సర్వేలో ఎవరి ఇంట్లోనైనా సభ్యులు విదేశాలకు వెళ్లారా, ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారా? వంటి వివరాలు రాబడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఐదు సర్వేలు ఒకేసారి చేయిస్తున్నారు. త్వరలో స్వర్ణాంధ్ర సర్వే కూడా చేపట్టనున్నట్లు వార్తలొస్తు న్నాయి. దీనితో ఇంకా ఎన్ని సర్వేలు చేయా లోనని సచివాలయ సెక్రటరీలు లోలోపలే మదనపడుతున్నారు.

రోజుకో సర్వే.. పూటకో సర్వే సంక్షేమ పథకాల్లో కోతకేనాఅని ప్రజల్లో సందేహాలు సచివాలయ సిబ్బందికి సర్వేలతో తప్పని తిప్పలు

రోజూ టెలికాన్ఫరెన్స్‌

గత ప్రభుత్వంలో భార్య లేదా భర్త పింఛన్‌ పొందుతూ చనిపోతే బతికున్న భార్య లేదా భర్తకు ఆ పింఛన్‌ అందజేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మార్చిలో చనిపోయిన వారి భర్త లేదా భార్యలకే పింఛన్లు ఇస్తున్నారే తప్ప, తొమ్మిది మాసాలలో చనిపోయిన వారి కుటుంబాలకు పింఛన్‌ వర్తింపజేయడం లేదు. దీనితో చాలా మంది పింఛన్లు పొందని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పింఛన్లను తొలగిస్తున్న తరుణంలో ఇక కొత్త పింఛన్లు ఇవ్వడం జరగదేమోనని ప్రజలు అనుమానిస్తున్నారు. ఈ సర్వేల వెనక మతలబు ఇదేనని పలువురు ఆందో ళన చెందుతున్నారు.

అన్ని సర్వేల్లో కేవలం ఇంటి పేరు, పేరు మాత్రమే చెప్పి సర్వే చేయమనడం వల్ల వారు ఎక్కడ నివసిస్తున్నారో, వారి డోర్‌ నంబర్‌ ఏమిటో తెలియక సచివాలయ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. పైగా ఎవరెవరు ఎంత మందిని సర్వే చేశారని ఉన్నతాధికారులు రోజూ టెలి కాన్ఫరెన్స్‌లో ఒత్తిడి చేస్తున్నారు. ఇంటిపేరు, పేరు ఆధారంగా వారిని ఏదో విధంగా గుర్తించినప్పటికీ చాలా మంది సర్వేలకు సహకరించడం లేదని, ఓటీపీలు చెప్పడం లేదని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
అరకొర పింఛన్లే గతి 1
1/2

అరకొర పింఛన్లే గతి

అరకొర పింఛన్లే గతి 2
2/2

అరకొర పింఛన్లే గతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement