ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా వెనుకబాటు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కా రానికి సంబంధించి సంతృప్తిస్థాయిలో జిల్లా చాలా వెనుకబడి ఉందని కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి అర్జీదారులకు సరైన అండార్స్‌మెంట్‌తో రిజిస్టర్ పోస్టులో లేదా నేరుగా సమాధానం ఇవ్వాలని సూచించారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ఉగాది పండుగ రోజు పీ4 సర్వేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించనున్నారని, ఆలోగా సర్వే వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆదేశించారు. మండలస్థాయి అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా పర్యవేక్షించాలన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ–కోసం) జరి గింది. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు 142 అర్జీలు అందాయి. కలెక్టర్‌తో పాటు జేసీ గీతాంజలిశర్మ, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ బి.శ్రీదేవి, ఆర్డీఓ కె.స్వాతి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్, డ్వామా పీడీ శివప్రసాద్‌యాదవ్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రమణారావు, డీఎస్‌ఓ పార్వతి, డీపీఓ అరుణ తదితర అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమైన అర్జీలు ఇవీ..
● అవనిగడ్డ మండలం వేకనూరు పంచాయతీ పరిధిలోని రక్షిత మంచినీటి పథకానికి 45 సంవత్స రాల క్రితం వేసిన సిమెంటు పైప్‌లైన్ పాడవడంతో వర్షాకాలంలో పైపుల్లోకి మురుగునీరు చేరి కుళా యిల్లో కలుషిత నీరు వస్తోందని గ్రామానికి చెందిన తుంగా మురళీకృష్ణ అర్జీ ఇచ్చారు. కొత్త ఫిల్టర్‌బెడ్లు, పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు.
● నడకుదురు గ్రామ పంచాయతీ కార్యదర్శి గతంలో తమ పంచాయతీలో పని చేసినప్పుడు పంచాయతీ రికార్డుల్లో పలు తప్పుడు బిల్లులను చూపి నిధులను దుర్వినియోగం చేశారని, విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామానికి చెందిన బచ్చు గంగాధరరావు అర్జీ ఇచ్చారు.
● చినముత్తేవి పీఏసీఎస్‌లో పాడి గేదెల కోసం తన పేరున ఉన్న 50 సెంట్ల మాగాణిభూమిపై 2018లో రుణం తీసుకున్నానని, బాకీ మొత్త తీర్చినా పొలానికి సంబంధించిన దస్తావేజులు, పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా నాలుగేళ్ల నుంచి తిప్పించుకుంటున్నారని మొవ్వ మండలం చినముత్తేవి గ్రామానికి చెందిన కూనపరెడ్డి జయలక్ష్మి అర్జీ ఇచ్చారు.
● తనకు కృత్తివెన్ను గ్రామంలో రెండు ఎకరాల భూమి ఉందని, ఆన్‌లైన్‌లో, అడంగళ్‌లో చూపించటం లేదని, తన భూమికి సంబంధింఛిన రిజిస్ట్రేషన్, పాస్‌పుస్తకం, శిస్తు రశీదులు, డాక్యుమెంట్లు పరిశీలించి అడంగల్‌లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కృత్తివెన్ను మండలం యండపల్లి గ్రామానికి చెందిన పిన్నెంటి మహాలక్ష్మి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
● తాము యానాది కులానికి చెందిన వారమని, 25 కుటుంబాలకు చెందిన వారదరం 20 ఏళ్లుగా పూరి గుడిసెలు వేసుకుని సముద్రం అంచున మడ అడవుల్లో పీతలు పట్టుకుని జీవనం సాగిస్తున్నా మని, ఈ నెల తొమ్మిదో తేదీన విశ్వనాథపల్లి నాగేశ్వరమ్మ వారి బంధువులతో వచ్చి తమపై దాడి చేసి పాకలు పీకివేసి బెదిరించారని బందరు మండలం పాతపల్లి తుమ్మలపాలెం గ్రామానికి చెందిన సీహెచ్ కొండయ్య, తదితరులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు గోడు వినిపించారు.
మీ– కోసం కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ వివిధ సమస్యలపై 142 అర్జీలు
Comments
Please login to add a commentAdd a comment