దేవినేనికి దిక్కేది? | - | Sakshi
Sakshi News home page

దేవినేనికి దిక్కేది?

Published Wed, Mar 12 2025 7:24 AM | Last Updated on Wed, Mar 12 2025 7:21 AM

దేవినేనికి దిక్కేది?

దేవినేనికి దిక్కేది?

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో కొన్నేళ్లపాటు ఏకఛత్రాధిపత్యం చలాయించిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇక రాజకీయంగా దిక్కెవరనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సర్వత్రా నడుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి సభ్యత్వం తప్పక దక్కుతుందని ఆశించి నామినేషన్‌ దాఖలుకు సిద్ధం చేసుకున్న దేవినేనికి చివరకు నిరాశ నిట్టూర్పులే మిగిలాయి. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆశీస్సులపై అంచనాలన్నీ క్రమంగా పటాపంచలవుతుండటంతో రాజకీయపరంగా దారీతెన్నూ తెలియని దిశకు చేరుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పదవి రాలేదన్న ఆవేదనను, ఆక్రోశాన్ని పంటిబిగువున దాచుకుంటూ కూడా తనదైన మార్కు మాటలతో తాజాగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తుండటాన్ని చూసి పార్టీలోని ఆయన వ్యతిరేకులు ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందంగా ఆయన వ్యవహారం ఉందని ఎద్దేవా చేస్తున్నారు. సీనియర్‌ నాయకుడిగా అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన ఉమా స్వయం కృతాపరాధాలే ఆయనకు శాపాలుగా మారాయని అనుభవజ్ఞులు అభిప్రాయపడుతుండటం పరిశీలనాంశం.

అవకాశాలు మెండుగా..

సోదరుడు దేవినేని వెంకటరమణ అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన ఉమా.. నందిగామ, మైలవరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, నీటిపారుదలశాఖ మంత్రిగా పని చేశారు. నిత్యం హడావుడి, ఆర్భాటాలతో, విమర్శలతో వ్యవహరించారన్నది విదితమే. ఆయన నాయకత్వంలో సీనియర్‌ నాయకులతో సఖ్యత విషయంలో ఎప్పుడూ పెటాకులే. కారణాలేవైనా కొడాలి నాని, వల్లభనేని వంశీ, కేశినేని నాని తదితర సీనియర్‌ నాయకులు టీడీపీని వీడటానికి ఉమానే ప్రధాన కారకుడనే విమర్శలు పార్టీ వర్గాల నుంచి వినిపించినవే.

ఎన్నికల సమయంలో..

మొన్నటి సాధారణ ఎన్నికల సమయంలో దేవినేని పార్టీ అధినేతను, అధిష్టానాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారని ప్రచారంలోకి రావడం, నాడు ఆయన వ్యవహార శైలి ఇప్పుడు ఆయనకు పదవి దక్కకపోవడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. మైలవ రం సీటును వసంత కృష్ణప్రసాద్‌కు రూ.100 కోట్లకు అమ్ముకున్నారని.. ఇలాంటి వాటికి తోడు నందిగామ సీటు విషయంలో అనవసర రాద్ధాంతానికి కారకులయ్యారనే అపప్రద మూటకట్టుకున్నారని గుర్తుచేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దేవినేని ప్రతిపక్షంతో చేతులు కలిపి వ్యాపార వ్యవహారాలూ కొనసాగించేవారనే ఫిర్యాదుల పరంపరతో పాటు ఆడియో, వీడియోలు సైతం అధిష్టానానికి పార్టీలోని ఆయన వ్యతిరేకులు చేరవేశారనే గుసగుసలు వినిపించాయి.

మద్దతు కూడగట్టుకోలేక..

ఢిల్లీ నుంచి పావులు కదిపినా..

ఉమాకు పదవి దక్కితే మైలవరం, నందిగామ నియోజవర్గాల్లోనే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాల్లోనూ వర్గాలను కూడగడతారని, లేనిపోని రాద్ధాంతాలు పునరావృతం అవుతాయని గతంలో జరిగిన ఉదంతాలను అధిష్టానం వద్ద, ముఖ్యంగా లోకేష్‌ వద్ద ఉదహరించినట్లు సమాచారం. ఉమాకు పదవి కేటాయించే విషయంలో మంత్రి లోకేష్‌ ససేమిరా అన్నట్లు ఆయన వ్యతిరేక వర్గం విస్తృతంగా ప్రచారం చేసింది. లోకేష్‌తో సన్నిహితంగా మెలుగుతున్న స్థానిక ఎంపీకి మరో రాజ్యసభ సభ్యుడు తోడై ఢిల్లీలో చక్రం తిప్పారని, అందువల్లే ఆగ ‘మేఘాల’పై కూటమిలోని మరో పార్టీ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి దక్కిందని అంటున్నారు.

దారీతెన్నూ తెలియని దిశలో మాజీ మంత్రి ఉమా

ఎమ్మెల్సీ ఖాయమని బాబు

సంకేతాలంటూ లీకులు

పరిగణనలోనే లేదని చినబాబు

వర్గీయుల ఎద్దేవా

ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పిన

ఎంపీలు, ఎమ్మెల్యేలు

స్వయంకృతాపరాధాలే ఉమాకు

శాపాలంటున్న పరిశీలకులు

దేవినేనికి జిల్లా పార్టీలో మద్దతుదారులు ఎవరనేది అటుంచితే వ్యతిరేకులు మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో ఉండటం గమనార్హం. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తదితరులు బాహాటంగానే వ్యతిరేకిస్తుండగా ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్న సందర్భాలు లేవనే చెప్పాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement