ఒలింపిక్ మెడల్స్ సాధించాలి
నాగాయలంక: నాగాయలంక వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ఇండియా ఒలంపిక్ గోల్డ్ మెడల్స్ సాధించే స్థాయికి ఎదిగి ఖేలో ఇండియా సెంటర్‌గా వెలుగొందాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అభిలషించారు. స్థానిక కృష్ణానది పరీవాహక ప్రాంతంలో నిలిచిపోయిన వాటర్ స్పోర్ట్స్ అకాడమీ భవనం పునఃప్రారంభ పనులకు మంగళవారం కలెక్టర్ శ్రీకారం చుట్టారు. ఈ పనుల కోసం కలెక్టర్ ఆధ్వర్యంలోని డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు నుంచి రూ.2కోట్లు నిధులు కేటాయించారు. కయోకింగ్, కెనోయింగ్‌లో నాగాయలంక యువతి నాగిడి గాయత్రి ఇటీవల నేషనల్స్‌లో స్వర్ణ పతకం సాధించడం ఆంధ్రప్రదేశ్‌కే గర్వకారణమని, మరింత మంది జల క్రీడాకారులు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. స్పోర్ట్స్ అకాడమీ భవనాన్ని అత్యంత నాణ్యతతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, క్రీడా సంస్థ అధికారులు స్థానిక శ్రీరామపాద క్షేత్రం ఘాట్ ఎదుట కృష్ణానది మధ్యలో ఉన్న నవలంక దీవిలో కొంత సేపు పర్యటించారు. నవలంకను పర్యాటకంగా ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చు అనే అంశాలపై చర్చించారు. కయోకింగ్, కెనోయింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరపర్ల వెంకటేశ్వరరావు, జిల్లా ప్రెసిడెంట్ దావులూరి సురేంద్రబాబు, జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి ఝాన్సీ పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment