మచిలీపట్నంటౌన్: బందరు అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకారం అందించాలని గనులు, భూగర్భ వనరులు ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. బందరు స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగర పరిధిలోని పాత రైల్వే స్టేషన్ నుంచి బందరుకోటకి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఇతర కూటమి నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం, కూటమి నాయకుల సహకారంతో నగరం మొత్తాన్ని పచ్చదనంగా మార్చేందుకు, రహదారులను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ ప్రణాళికలో భాగంగా నగరంలో రహదారులకిరువైపులా ఉన్న ఆక్రమణలను ఇప్పటికే తొలగిస్తూ వస్తున్నామన్నారు.
సీఆర్‌డీఏ పరిధిలోకి ముడా..
నగరంలోని రహదారులపై పశువుల సంచారంతో ప్రమాదాలకు ముప్పుగా మారిందని, దీనిని అధిగమించేందుకు మంగినపూడి బీచ్ ప్రాంతంలో 15 ఎకరాలు కేటాయించి, పట్టించుకోని పశువులను అక్కడకు తరలించనున్నట్లు మంత్రి చెప్పారు. జిల్లా పరిధిలోని ముడా ఏరియాని సీఆర్‌డీఏ రాజధాని పరిధిలోకి తీసుకువచ్చే విధంగా జిల్లాలోని ముఖ్య నాయకులతో త్వరలో ముఖ్యమంత్రిని కలిసి అభ్యర్థిస్తామన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, జిల్లా ప్రజా రవాణా అధికారి వాణీశ్రీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర