కన్నీరే పారు | - | Sakshi
Sakshi News home page

కన్నీరే పారు

Apr 2 2025 1:23 AM | Updated on Apr 2 2025 1:23 AM

కన్నీ

కన్నీరే పారు

చివరి ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకమే!

చంద్రయ్య డ్రెయిన్‌లో మేట వేసుకుపోయిన గుర్రపుడెక్క

బుడమేరు డ్రెయిన్‌లో పుట్టగుంట వద్ద నుంచి గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. కాంట్రాక్టర్‌ మెయింటెనెన్స్‌ పేరుతో ఏటా కాంట్రాక్టు తీసుకోవడమే కానీ పనులు చేయడం లేదు. పుట్టగుంట వద్ద నుంచి కొల్లేరు వరకు ఒక్క తూడు మొక్క తీసిన దాఖలాలు లేవు. అడ్డగోలుగా సగానికి సగం టెండర్లు దాఖలు చేసి పనులు చేయకుండానే బిల్లులు చేజిక్కించుకుంటున్నారు. దీని వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది.

– సత్యనారాయణ, రైతు ఎల్‌ఎన్‌పురం

సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పంట కాలువలు గుర్రపుడెక్క, వ్యర్థాలతో పూడుకుపోయి అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి పూడికతీతలు లేవు. కాలువ చివరి భూములకు నీరు ప్రశ్నార్థకంగా మారింది. కేవలం గుర్రపుడెక్కపై క్రిమిసంహారక మందులు పిచికారీ చేయటంతో సరిపెట్టకుండా పూర్తి స్థాయిలో పూడికతీతలు చేపట్టాలి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నాటికి కాలువల ఆధునికీకరణ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పాలకులు చర్యలు తీసుకోవాలి.

– వి.మరియదాసు, కౌలురైతు,

గొడవర్రు, కంకిపాడు మండలం

ఇప్పటికే పరిపాలన అనుమతుల కోసం కాడ్‌కు ప్రతిపాదనలు పంపాం. ఆమోదం లభించిన వెంటనే పనులను నీటి సంఘాల ఆధ్వర్యంలో చేపడతాం. కాలువలకు తాగునీరు విడుదల చేసి నిలిపివేసిన తర్వాత ఈ పనులు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తాం.

– మోహనరావు, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ, ఉమ్మడి కృష్ణా జిలా్ల

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాలో కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సకాలంలో పనులు చేయక పోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం ప్రశ్నార్థకంగా మారుతోంది. వర్షాలు వస్తే, డ్రెయిన్లు పొంగి పొలాల నుంచి నీరు బయటకు పోక అల్లాడిపోతున్నారు. కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు సంబంధించి 6.79 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సింది. అయితే కాలువలు, డ్రెయిన్లకు సకాలంలో పూడికతీత, మరమ్మతులు చేపట్టకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత ఏడాది(2024–25) పనులకు టెండర్లు ఆలస్యంగా పిలిచి, ఖరారు చేయడంలోనూ జాప్యం జరిగింది. 160 పనులు రూ.32.79కోట్లతో చేపట్టారు. అయితే ఈ పనుల్లో టీడీపీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని, టెండర్లతో సంబంధం లేకుండానే కొంత మంది కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పారు. వారు 40–48 శాతం తక్కువకు పనులు దక్కించుకున్నారు. వీరంతా కాలువలు, డ్రెయిన్ల పనులు చేయకుండానే మమ అనిపించి చేతులు దులుపుకున్నారు. నిర్వహణను గాలికి వదిలేశారు. కాలువలకు జూన్‌లోనే నీరు విడుదల చేసే అవకాశం ఉండటంతో పనులు చేసే పరిస్థితి లేదు. దీంతో కాంట్రాక్టర్లు, నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మక్కై నామమాత్రంగా పనులు చేసి, బిల్లులు దండుకొంటున్నట్లు తెలుస్తోంది.

ఈ సారైనా చేస్తారా?

2025–26కు సంబంధించి కృష్ణా డెల్టా ప్రాజెక్టు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, సాగునీటి వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో నీటి పారుదల శాఖ అధికారులు 568 పనులు రూ.26.03కోట్లతో కాడ్‌(కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ) కమిటీకి ప్రతిపాదనలు పంపారు. ఇంకా పనులకు ఆమోదం లభించలేదు. అయితే ఈ ఏడాది నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు జరగటంతో వారి ఆధ్వర్యంలో పనులు సాగనున్నాయి. టెండర్లు లేకుండా నామినేషన్‌ పద్ధతిలోనే పనులు కట్టబెట్టనున్నారు. పనులు సకాలంలో మంజూరు చేసి, పరిపాలనా అనుమతులు ఇవ్వకపోతే.. నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉంది.

అధ్వానంగా డ్రెయిన్లు..

గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగటంతో పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునిగి, రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ప్రస్తుతం వర్షం వస్తే రైతులకు కంటిమీద కునుకు ఉండని పరిస్థితి కృష్ణా డెల్టాలో నెలకొంది. కొద్ది పాటి వర్షానికే డ్రెయిన్‌లు పొంగి పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో డ్రెయిన్‌లు పూడికతీయకపోవడం వల్ల అధ్వానంగా మారాయి. బుడమేరు, చంద్రయ్య, నెహ్రాల్లీ, మోటూరు ఎల్‌ఎస్‌ మేజర్‌ డ్రెయిన్లు దారుణంగా ఉన్నాయి. లజ్జబండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకొడు, వన్నేరు, ముస్తాఫాకొడు, యూటీ, పెద్దలంక, గుండేరు, రత్నకొడు డ్రెయిన్లలో గుర్రపుడెక్క, నాచు, తూడు దట్టంగా పేరుకుపోయి మురుగు నీరు సక్రమంగా దిగువకు ప్రవహించని పరిస్థితి. విజయవాడ నుంచి నందివాడ మండలం ఎల్‌ఎన్‌ పురం వరకు బుడమేరులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. ఈ ఏడాదైనా పనులు సక్రమంగా చేపట్టకపోతే, రైతులు తీవ్ర ఇబ్బంది పడతారు.

అధ్వానంగా కాలువలు, డ్రెయిన్లు పేరుకుపోయిన తూటికాడ, గుర్రపుడెక్క వర్షం వస్తే పంట పొలాల మునక ఈ ఏడాది నిర్వహణ పేరిట 568 పనులకు రూ. 26 కోట్లతో ప్రతిపాదనలు

ప్రతిపాదనలు పంపాం..

ఈ ఏడాది(2025–26) కాలువల నిర్వహణ కోసం ప్రతిపాదించిన పనులు..

డివిజన్‌ పనుల విలువ సంఖ్య (రూ.కోట్లలో)

కృష్ణా తూర్పు 121 8.45

కృష్ణా సెంట్రల్‌ 144 7.28

డ్రెయినేజి విభాగం 288 9.00

స్పెషల్‌ 15 1.30

మొత్తం 568 26.03

కన్నీరే పారు 1
1/2

కన్నీరే పారు

కన్నీరే పారు 2
2/2

కన్నీరే పారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement