
ఎంపీటీసీ సభ్యులను అభినందించిన వైఎస్ జగన్
నందిగామటౌన్: అధికార దాహంతో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ధైర్యంతో ఎంపీపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారంటూ ఎంపీటీసీ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారని శాసన మండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్, మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమావేశంలో మండలంలోని ఎంపీటీసీ సభ్యులతో కలిసి వారిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీటీసీ సభ్యుల పూర్తి సహకారంతోనే మండల పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ఇదే సంకల్పంతో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని చెప్పారు. అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం చెప్పారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన బృందంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా ఉన్నారు.