
ధర.. కన్నీటి ధార
బజ్జీ మిర్చి రైతుల ఆశలు నేలపాలు
బజ్జీ మిర్చి రైతు ఆశలు నేలపాలవుతున్నాయి. మద్దతు ధర లభించకపోవడంతో దివిసీమలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలోనే బజ్జీ మిర్చి సాగు అధికంగా సాగవవుతోంది. ధర లేక.. కొనుగోళ్లు జరగక పంటను కోత కోయించి పారబోస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మోపిదేవి (అవనిగడ్డ): కనీస మద్దతు ధర లభించక ఓ వైపు సాధారణ మిర్చి రైతులు రోడ్డెక్కుతుంటే.. బజ్జీ మిర్చి సాగుచేసే రైతులు కూడా ఆశించిన రేటులేక.. కొనుగోళ్లు జరగక లబోదిబోమంటున్నారు. కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతంలో బజ్జీ మిర్చి సాగు ఎక్కువగా జరుగుతుంది. అయితే బజ్జీ మిర్చి ధర ఈ ఏడాది బాగా పడిపోయింది. దీంతో రైతులు పంటను కోయించి పారబోస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి, అవనిగడ్డ మండలాల్లోని 165 ఎకరాల్లో బజ్జి మిర్చి సాగుచేస్తున్నారు. ఇది సాధారణ మిర్చిలా కారం ఉండదు. దీంతో కూరల్లో వీటిని వినియోగించరు. బజ్జీలు, సాస్‌లకు మాత్రమే వాడతారు..
గతేడాది బస్తా రూ.2,500..
ఇప్పుడు రూ.250
గత సంవత్సరం బస్తా (50 కిలోలు) ధర రూ.2,500 వరకూ పలికింది. దీంతో ఎక్కువమంది రైతులు ఈ మిర్చి సాగుకు మొగ్గు చూపారు. ఎకరాకు లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం మిర్చి ధర బస్తా రూ.250 మాత్రమే పలుకుతోంది. సంచికి రూ.50, కోసినందుకు కూలీకి రూ.150, రవాణాకు రూ.50 మొత్తం కలుపుకుని రూ.250 అవుతుంది. బస్తా మిర్చి ధర కూడా ఇదే రేటు ఉంది. గత్యంతరంలేని పరిస్థితుల్లో రైతులు పంటను కోసేసి పారబోస్తున్నారు. తయారైన మిర్చిని పదిహేను రోజులు కోయకుండా వదిలిస్తే పండిపోయి కుళ్లిపోతుంది. తయారైన కాయలు కోయకపోతే కొత్తగా పూత, పిందె పడదు. అందుకే కాయలు కోసి పారబోస్తున్నట్లు రైతులు ఆవేదనతో చెప్పారు.
దక్కని మద్దతు ధర కోత కోయించి పారేస్తున్న రైతులు గతేడాది 50 కిలోల బస్తా రూ.2,500, నేడు కేవలం రూ.250 ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల ఖర్చు సాస్ కంపెనీలు కొనుగోళ్లుఆపేయడంతో పడిపోయిన ధర కృష్ణా జిల్లా దివిసీమ రైతుల గగ్గోలు
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
గతేడాది బజ్జీ మిర్చి బస్తాను రూ.2,000 పైగా ధరకు కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం 3.5 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేశాను. ఎకరాకు కౌలు రూ.40 వేలు.. ఖర్చు రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు అయ్యాయి. కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఏంచేయాలో తెలీడంలేదు. ప్రభుత్వం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలి.
– రాజులపాటి రామ్మోహనరావు, రైతు,
మోపిదేవిలంక, మోపిదేవి మండలం
మార్క్‌ఫెడ్ అధికారుల
దృష్టికి తీసుకెళ్తా
బజ్జీ మిర్చి కొనుగోళ్లు జరగడంలేదనే విషయం నా దృష్టికి రాలేదు. గతేడాది బాగా ధర ఉండటంతో ఈసారి ఎక్కువమంది ఈ రకం మిర్చిని సాగుచేశారు. మార్క్‌ఫెడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాం.
– రమేష్,
ఉద్యాన శాఖాధికారి, అవనిగడ్డ

ధర.. కన్నీటి ధార

ధర.. కన్నీటి ధార

ధర.. కన్నీటి ధార