
నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి
తిరువూరు: భారీ వర్షాలు, ఈదురుగాలులతో నియోజకవర్గంలో రైతులు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తిరువూరు మండలంలో కురిసిన వడగళ్లవానకు తడిసిన ధాన్యాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. గత వారం రోజుల్లో రెండుసార్లు వీచిన ఈదురు గాలులతో రైతులు పూర్తిగా నష్టపోయారని, మామిడి, బొప్పాయి, వరి, మొక్కజొన్న తదితర పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని స్వామిదాసు పేర్కొన్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని చెప్పారు. ఆరుగాలం కష్టపడినా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తరలించగా తడిసిన ధాన్యాన్ని, కాకర్లలో మామిడితోటల్లో రాలిన కాయలను పరిశీలించారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తాళ్లూరి నవీన్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ
ఇన్‌చార్జి స్వామిదాసు