
నిబంధనలు మట్టిపాలు!
● ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా తవ్వకాలు ● అనుమతులు లేకుండా దోపిడీ ● ఎంయూడీఏ, బుడమేరు, చెరువుల నుంచి భారీగా తరలింపు ● పట్టించుకోని అధికారులు
పేట్రేగిపోతున్న మట్టి మాఫియా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా నిర్వహిస్తూ రూ. కోట్లు గడిస్తోంది. వేసవి కాలం కావడంతో చెరువులు, నదులు, వాగులు, కొండలు, గుట్టల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలు ఈ మాఫియాకు ఉండటంతో, అధికారులు సైతం తమకేమి పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రైవేటు వెంచర్లు, కట్టడాలు, రోడ్డు పనులకు భారీగా మట్టి తరలించి, కోట్ల రూపాయలను కొల్లగొడుతోంది.
అధికారం మనదే.. లోడెత్తండి..
● మైలవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. జి.కొండూరు మండల పరిధి కోడూరు చెరువు నుంచి ఇటీవల అక్రమంగా మట్టిని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగూడెం, రంగాపురం, కొత్తనాగులూరు, జి.కొండూరు మండల పరిధి చిన్ననందిగామ గ్రామాల నుంచి గతంలో డంప్ చేసిన మట్టిని ఇటుక బట్టీలకు అక్రమ రవాణా చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధి బంధువు అండతో దందా జరుగుతోందని సమాచారం.
● జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో అక్రమ గ్రావెల్ రవాణా జరుగుతోంది. అధికార పార్టీ నాయకులు రాత్రి వేళల్లో టిప్పర్లు, ట్రాక్టర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో 65వ నంబర్ జాతీయ రహదారి సూర్యాపేట నుంచి కోదాడకు 6 రోడ్ల విస్తరణలో భాగంగా గ్రావెల్‌ను రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. వత్సవాయి మండలంలో భీమవరం సమీపంలోని కొంగర మల్లయ్యగట్టు నుంచి రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అనుచరులు ఈ మట్టి దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
● తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు మండలం గోపాలపురంలో కొండను గుల్ల చేస్తున్నా రు. విస్సన్నపేట మండలంలో కొండపర్వలో భారీగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకు వందల ట్రక్కుల మట్టిని తెలంగాణకు తరలిస్తున్నారు. ట్రిప్పర్‌కు రూ.12వేల–రూ.15వేలు వసూలు చేస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు, పొలాల మెరక చేయడానికి, రోడ్లు నిర్మించడానికి విక్రయిస్తున్నారు. విజయవాడ రూరల్ మండల పరిధిలో పోలవరం కుడికాలువ మట్టిని టీడీపీ నేతలు రాత్రివేళల్లో అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. తిరువూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి ప్రోద్బలంతోనే దందా సాగుతున్నట్లు తెలుస్తోంది.