నంద్యాల: మాజీ మంత్రి భూమా అఖిలప్రియవి దిగజారుడు రాజకీయాలని సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆమె తనపై చున్నీలాగానని కేసు పెట్టడం బాధ కలిగించిందన్నారు. పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కొత్తపల్లె గ్రామం వద్ద జరిగిన ఘటనలో తండ్రి లాంటి వయసు ఉన్న తనపై చున్నీ లాగి, హత్యాయత్నం చేసినట్లు అఖిలప్రియ కేసు పెట్టడం మహిళా సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు.
ఇలాంటి ఆరోపణల వల్ల ఇద్దరి పరువు పోతుందని, కేసు పెట్టాలంటే ఎన్నో రకాల కారణాలు ఉంటాయని, మరీ ఇంత దిగజారడం ఏమిటని ప్రశ్నించారు. అఖిలప్రియ విధానాల వల్ల ఆమె కుటుంబ సభ్యులే దూరమవుతున్నారన్నారు. ఆళ్లగడ్డలో భూమా వర్గాన్ని, టీడీపీ కార్యకర్తలను దూరం చేసుకుందన్నారు. తనపై తప్పుడు ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు తనను అరెస్టు చేయలేదన్నారు.
పలుచోట్ల అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడటంతోనే అఖిలప్రియను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, ఇందులోనూ తన ప్రమేయం ఏమీ లేదన్నారు. అప్పు చెల్లించాలని బంధువులే ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారని, తల్లి, తండ్రి నుంచి రాజకీయ వారసత్వం ఆశించినప్పుడు వారి అప్పులు కూడా కట్టాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రాబోయే ఎన్నికల్లో ఆళ్లగడ్డ, నంద్యాలలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment