విమానయానంపై పెరిగిన ఆసక్తి
ఉయ్యాలవాడ నరసింహారెడ్డివిమానాశ్రయం నుంచి వైజాగ్, చైన్నె నగరాలకు విమానాలు
ఏటా పెరుగుతున్నవిమాన ప్రయాణికులు
మూడేళ్ల కాలంలో1,20,732 మంది ప్రయాణం
మరిన్ని సర్వీసులు పెంచాలని ప్రయాణికుల విజ్ఞప్తి
కర్నూలు(సెంట్రల్): విమాన ప్రయాణంపై ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఓర్వకల్లు సమీపంలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం నుంచి వైజాగ్, చైన్నె నగరాలకు తక్కువ సమయంలో చేరుకోగలుగుతున్నారు. వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి విమానాశ్రయం అనువుగా ఉంటోంది. సమయం, డబ్బును ఆదా అవుతోంది. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి మూడేళ్లలో 1,20,732 మంది ప్రయాణం చేశారు. ఇందులో వివిధ ప్రాంతాల నుంచి 57,327 మంది కర్నూలుకు రాగా, కర్నూలు నుంచి 63,405 మంది విశాఖపట్నం, బెంగళూరు, చైన్నె మహా నగరాలకు వెళ్లారు.
ఎయిర్‌పోర్టు ప్రస్థానమిదీ..
ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం ఉండాలని దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంకల్పించారు. ఈ కోవలోనే కర్నూలు విమానాశ్రయానికి బీజం పడింది. ఇందుకోసం ఓర్వకల్లు సమీపంలో 1,010 ఎకరాలు కేటాయించారు. కేంద్ర విమానయాన శాఖ అనుమతులు రావడంతో 2017లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయిలో వసతులు సమకూరిన అనంతరం 2021 మార్చి 28న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారు. అప్పటి నుంచి విమానాల రాకపోకలు జోరందుకున్నాయి.
ఇవీ సౌకర్యాలు
● కర్నూలు–నంద్యాల జాతీయ రహదారి నుంచి ఎయిర్‌పోర్టు చేరుకోవడానికి వీలుగా అప్రోచ్ రోడ్డు నిర్మించారు.
● ప్రయాణికులు, వివిధ వాహనాల రాకపోకలకు వీలుగా నాలుగు ఇంటర్నల్ రోడ్లు ఉన్నాయి.
● 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ (పీటీబీ) ఉంది.
● టెర్మినల్‌కు ఎదురుగా నాలుగు విమానాలు ఒకేసారి పార్కింగ్ చేసేందుకు ఆప్రాన్ నిర్మించారు.
● టర్మినల్ బిల్డిండ్ బయట వైపు కనువిందు చేసేలా ఉద్యానవనం అభివృద్ధి చేశారు.
విశాఖకు అధికం
కర్నూలు నుంచి విశాఖపట్నం, బెంగళూరు, చైన్నె మహానగరాలకు వారంలో నాలుగు రోజులు విమానాలు వచ్చి వెళ్తున్నాయి. వివిధ కారణాలతో నెలరోజుల నుంచి బెంగళూరు నుంచి వచ్చే విమానాలు రద్దయ్యాయి. మూడేళ్ల కాలంలో 1,20,732 మంది ప్రయాణించగా.. ఇందులో 60 వేల మంది విశాఖ నుంచి వచ్చి వెళ్లిన వారే ఉన్నారు. బెంగళూరుకు 38 వేల మంది, చైన్నెకు 22 వేల మంది ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది.
విమానయాన శాఖమంత్రి దృష్టి సారించాలి..
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ, తిరుపతి నగరాలకు విమానాలు తిప్పాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. ఈ మేరకు ఇండిగోతో ఒప్పందం కూడా చేసుకుంది. అయినా ఆ సంస్థ విమానాలను నడిపేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన రామ్మోహన్‌నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రిగా ఉన్నారు. కర్నూలు నుంచి తిరుపతి, విజయవాడలకు విమానాలు నడిపేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా బెంగళూరుకు విమాన సర్వీసులను పునరుద్ధరించాల్సి ఉంది. గతంలో ఫ్లైబిగ్ అనే విమాన సంస్థ కర్నూలు నుంచి హైదరాబాద్‌కు విమానం నడిపేందుకు ఒప్పందం చేసుకున్నా ఫలితం లేకపోయింది. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు విమానాలు తిరిగితే అరగంటలో వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment