No Headline
డోన్ రూరల్: మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో కొన్నేళ్లుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్న ఎద్దుల మిస్టరీ ఎట్టకేలకు వీడింది. పశువుల మరణం వెనుక అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలో పట్టుబడటంతో గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. బుధవారం గ్రామానికి చెందిన రైతు బుగ్గన శివరామిరెడ్డి ఎద్దు ఒకటి మృత్యువాత పడింది. అయితే అనుమానంతో పశువుల పాకలోని సీసీ కెమెరా పుటేజీని గురువారం ఆయన పరిశీలించాడు. అదే గ్రామానికి చెందిన శంకరాచారి బుధవారం మధ్యాహ్నం సమయంలో ఎవరూ లేనిది చూసుకుని గోడ దూకి లోపలికి వచ్చి ఎద్దుకు విష గుళికలు తినిపించినట్లు గుర్తించాడు. ఇప్పటి వరకు గ్రామంలో ఎద్దుల మృత్యువాతకు అతనే కారణమని గ్రామస్తులు భావించి పోలీసులకు అప్పగించారు. అయితే, శంకరాచారి ఎద్దులను ఎందుకు టార్గెట్ చేశారో పోలీసుల దర్యాపులో తేలాల్సి ఉంది.
మూడేళ్లలో 64 పశువులు మృతి...
కమలాపురం గ్రామ ప్రజలకు అధిక శాతం వ్యవసాయమే ఆధారం. ఈ మేరకు రైతులు ఎద్దులను పోషిస్తున్నారు. కాగా మూడేళ్లుగా గ్రామంలో ఇప్పటి వరకు 64 ఎద్దులు మృతి చెందాయి. అందరూ అనారోగ్యం, విష ఆహారం తిని ఎద్దులు చనిపోయాయని భావించారు. గ్రామానికి చెందిన బుగ్గన శివరామిరెడ్డి ఇంట్లోనే 14 ఎద్దులు మృత్యువాత పడ్డాయి. ఎద్దుల మృతికి గ్రామానికి చెందిన శంకరాచారి కారణమని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇతను గ్రామంలో వడ్రంగి పని చేస్తూ జీవిస్తున్నాడు. రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు తయారు చేసేది ఇతనొక్కడే. అలాంటిది మూగజీవాలను ఎందుకు బలితీసుకుంటున్నాడో అర్థం కావడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు తనకేమి తెలియదని బుకాయిస్తున్నట్లు తెలుస్తోంది. పశువులకు విషపు గుళికలు పెట్టి చంపేస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన రైతులు గురువారం డోన్ రూరల్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు శంకరాచారిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ రాకేష్ తెలిపారు.
అతని టార్గెట్ ఎద్దులే!
విషం పెట్టి చంపేస్తున్న వైనం
సీసీ కెమెరా పుటేజీలో పట్టుబడిన
అదే గ్రామానికి చెందిన వ్యక్తి
No Headline
Comments
Please login to add a commentAdd a comment