
ఐక్యతకు ప్రతీక రోజా దర్గా
● రేపటి నుంచి తుంగా తీరంలో ఆధ్యాత్మిక వేడుక ● దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో 535వ ఉరుసు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి ● తరలిరానున్న వేలాది మంది భక్తులు
కర్నూలు కల్చరల్: కర్నూలు నగరం తుంగభద్రా నది తీరాన హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా రోజా దర్గా వెలుగొందుతోంది. ఈ దర్గా ముస్లిం ప్రజల దైవస్థానం అయినప్పటికీ హిందూ ప్రజలు భక్తులుగా ఉండటం విశేషం. ప్రతి గురు, శుక్రవారాల్లో భక్తులు ఈ దర్గాను సందర్శిస్తుంటారు. బాబా హజరత్ సయ్యద్ షా ఇస్ హక్ సనావుల్లా ఖాద్రి బాగ్దాద్ దేశీయుడు. 18 సంవత్సరాల వయస్సులో బర్నాల అనే గ్రామంలో 50 సంవత్సరాలు నిరాహార దీక్షలు చేశారని ప్రతీతి. అనంతరం ఆయన బాగ్దాద్ వెళ్లి వివాహం చేసుకొని సయ్యద్‌షా తాజ్ మహమ్మద్‌కు జన్మనిచ్చాడని మతాధిపతు ల అభిప్రాయాలను బట్టి తెలుస్తోంది. తదనంతర మే సనావుల్లా ఖాద్రి కర్నూలుకు వచ్చి తుంగభద్రా నదీ తీరాన రోజా అనే గ్రామంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారని పీఠాధిపతి కుటుంబీకులు చెబుతుంటారు.
28 నుంచి ఉరుసు
రంజాన్ మాసం ప్రారంభానికి చిహ్నంగా నెలవంక కనిపించిన రోజున రోజా దర్గా ఉరుసు ప్రారంభమవుతుంది. ప్రస్తుత దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా దాదా బాషా ఖాద్రి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఈనెల 28న రాత్రి గంధోత్సవంతో ప్రారంభమవుతాయి. మార్చి 1వ తేదీ (శనివారం) ఉరుసు, 2వ తేదీ (ఆదివారం)జియారత్ ముషరఫ్ కార్యక్రమం ఉంటుంది.ఉరుసు ఉత్సవాలకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఫాతెహాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులకు దర్గా కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్గా ఆవరణలో చలువ పందిర్లను ఏర్పాటు చేశారు.
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఈ ఏడాది రోజా దర్గా 535వ ఉరుసు ఘనంగా నిర్వహించనున్నాం. వేడుక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉరుసులో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. అన్నదానం నిర్వహిస్తాం. కులమతాలకు అతీతంగా భక్తులు ఉరుసులో పాల్గొని విజయవంతం చేయాలి. – సయ్యద్‌షా దాదా
బాషా ఖాద్రీ, రోజా దర్గా పీఠాధిపతి

ఐక్యతకు ప్రతీక రోజా దర్గా
Comments
Please login to add a commentAdd a comment