రోగాలు ‘కొని’తెచ్చుకుని!
పెరిగిన పరగడుపు మాత్రలు
● రోజుకు 10 నుంచి 15 మాత్రలు
మింగుతున్న జనం
● బీపీ, షుగర్‌తో పెరుగుతున్న
వినియోగం
● ఉమ్మడి జిల్లాలో 2 వేల
మెడికల్ షాపులు
● రోజూ రూ.6 కోట్ల దాకా
మందుల వ్యాపారం
కర్నూలు(హాస్పిటల్): ఒంట్లో ఏదైనా నలతగా ఉంటే చాలా మందికి మాత్రలు వేసుకునే వరకు మనసు ఊరుకోదు. జలుబు చేసినా, జ్వరం వచ్చినట్లు అనిపించినా, కడుపులో కాస్త నొప్పిగా ఉన్నా వెంటనే సమీపంలోని మెడికల్ షాపునకు వెళ్లి ఆరోగ్య సమస్యను చెప్పి మందులు కొని వేసుకోవడం పరిపాటిగా మారింది. గతంలో వందలో నలుగురైదుగురు ఇలా చేస్తుండగా.. ఇప్పుడు నూటికి 20 మందికి పైగా మెడికల్ షాపులనే నమ్ముకున్నారు. మరికొందరికి బీపీ, షుగర్ వంటి జబ్బుల కారణంగా వాటిని తగ్గించుకునేందుకు ప్రతిరోజూ పదుల సంఖ్యలో మందులు వాడుతున్నారు. దీనివల్ల ఉన్న వ్యాధి తగ్గడం ఏమో కానీ, కొత్త వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మరో 700 పైగా హోల్‌సేల్ మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. సగటున రూ.6కోట్లకు పైగా మందులు, సర్జికల్స్ వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. కోవిడ్‌కు ముందు రోజు వ్యాపారం రూ.4కోట్ల వరకు ఉండగా, అనంతరం వచ్చిన జీవనశైలి మార్పులు, అలవాట్ల కారణంగా మందుల వాడకంతో పాటు వాటి ధరలు కూడా పెరగడం గమనార్హం.
పెరుగుతున్న జీవనశైలి జబ్బులు
బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధులు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. ఆహారంలో కల్తీ, ఎరువులు, క్రిమిసంహారక మందులతో పంటలు పండించడం, మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం, శ్రమకు మించి ఆహారాన్ని తీసుకోవడం వంటి కారణాల వల్ల జీవనశైలి జబ్బులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా వీటికి వాడే మందుల బడ్జెట్ ప్రతి ఇంట్లో అధికమైంది. ప్రతి ఇంట్లో కేవలం మందులకు పెట్టే ఖర్చు రూ.2వేల నుంచి రూ.5వేల దాకా ఉంటోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ మందుల వ్యాపారం ప్రైవేటులో రూ.6కోట్లకు పైగా ఉంటోంది. ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకే ప్రభుత్వం ప్రతి యేటా ఇచ్చే మందుల బడ్జెట్ రూ.40కోట్లు దాకా ఉంటోంది. వీటితో పాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, యుపీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో మరో రూ.30కోట్ల దాకా మందులకు నిధులు కేటాయిస్తున్నారు.
నిద్రలేస్తూనే నోట్లోకి వెళ్తున్న మాత్రలు
జబ్బుల కారణంగా నిద్రలేస్తూనే మాత్రలు వేసుకునే పరిస్థితి అధికమైంది. ఉదాహరణకు థైరాయిడ్ జబ్బుకు వాడే మాత్రలు నిద్రలేస్తూనే వేసుకోవాల్సి ఉంటుంది. ఆ మాత్ర వేసుకున్నాక గంట నుంచి రెండు గంటల వరకు కాఫీ, టీలు కూడా తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో షుగర్, గ్యాస్ట్రబుల్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జనాభాలో 15 నుంచి 20 శాతం వరకు షుగర్ బాధితులు ఉన్నారు. వీటికి వాడే మందులు సైతం చాలా వరకు తినకముందు వేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు కొన్ని రకాల యాంటిబయాటిక్స్ మాత్రలు సైతం తినకముందు వేసుకుంటేనే బాగా పనిచేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.
దేవనకొండకు చెందిన రాజేష్ కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో నొప్పి మాత్రలతో పాటు కడుపులో మంట రాకుండా గ్యాస్ట్రబుల్ మాత్రలు కూడా వేసుకున్నాడు. అప్పటి నుంచి రోజూ అతను గ్యాస్ట్రబుల్ మాత్రలు వాడుతూ వస్తున్నాడు. దీంతో పాటు కుటుంబ సమస్యలు, వంశపారంపర్యం కారణంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జబ్బులు తోడు కావడంతో మాత్రల సంఖ్య బాగా పెరిగింది. వీటి వాడకం వల్ల ఏమైనా అవుతుందేమోననే బెంగతో మరికొన్ని మాత్రలు వాడటంతో ఏ జబ్బూ ఒక పట్టాన తగ్గని పరిస్థితి నెలకొంది.
కర్నూలుకు చెందిన శివయ్య ఓ ప్రైవేటు సంస్థలో ఎగ్జిక్యూటివ్. సోషల్ మీడియాలో వచ్చే వైద్యసంబంధిత రీల్స్, కథనాలు చూస్తుంటాడు. ఏ చిన్న వ్యాధి లక్షణం కనిపించినా దానికి సంబంధించిన మాత్రలను మందుల దుకాణానికి వెళ్లి తెచ్చుకుంటాడు. ఇలా ప్రతిరోజూ 12 నుంచి 15 దాకా మాత్రలు వేసుకుంటాడు. చివరకు వైద్యుని వద్దకు వెళితే అన్ని పరీక్షలు చేయించి ఎలాంటి జబ్బూ లేదని నిర్ధారించారు. తెలియని భయం కారణంగా మందుల వాడకం ఎక్కువైందని, ఏ మందులూ అవసరం లేదని డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment