ప్రణవ నాదం ప్రతిధ్వనించింది.. ప్రభోత్సవం కనుల పండువగా స
● శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి
బ్రహ్మోత్సవాలు
● కనుల పండువగా ప్రభోత్సవం,
నందివాహనసేవ
● పాగాలంకరుడైన
శ్రీమల్లికార్జున స్వామి
● శాస్త్రోక్తంగా మహాన్యాస పూర్వక
ఏకాదశ రుద్రాభిషేకం
● వైభవంగా బ్రహ్మోత్సవ కల్యాణం
● నేడు రథోత్సవం, తెప్పోత్సవం
శ్రీశైలంటెంపుల్: ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలం శివమయం అయ్యింది. క్షేత్రంలో ఏ వైపు చూసినా భక్తుల కోలాహలం కనిపించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాదిగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునుడు నందివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామిఅమ్మవార్లకు అక్కమహాదేవి అలంకార మండపంలో నందివాహన సేవ నిర్వహించారు. నందివాహనంలో ఆదిదంపతులను అధిష్టింపజేసి ఆలయ ప్రదక్షణ ద్వారా ఊరేగింపు నిర్వహించారు.
రమణీయం.. ప్రభోత్సవం
శివరాత్రి తర్వాతి రోజు జరిగే రథోత్సవ నిర్వహణకు వీలుగా ముందస్తుగా ప్రతి ఏటా ప్రభోత్సవం నిర్వహిస్తారు. సుగంధ పుష్పాలతో ప్రభను బుధవారం సాయంత్రం అలంకరించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండిపల్లకీలో ఆలయ ప్రదక్షణ చేయించి క్షేత్ర ప్రధాన వీదుల్లోకి తోడ్కొని వచ్చారు. అనంతరం ప్రభపై ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశేష భక్తజనం మధ్య గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు ప్రభోత్సవం సాగింది. రాత్రి 10గంటల నుంచి స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. అర్చకులు, పండితులు మహాన్యాసపూర్వకంగా రుద్ర మంత్రాలను పఠిస్తుండగా జ్యోతిర్లింగ స్వరూపుడైన స్వామివారికి అభిషేకం చేశారు.
కమనీయం.. కల్యాణోత్సవం
రాత్రి 12గంటల సమయంలో స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ముందుగా కల్యాణానికి కంకణాలను, స్వామిఅమ్మవార్ల అభరణాలను కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. స్వామి, అమ్మవార్లను ముస్తాబు చేసి పెండ్లి పీటలపై అధిష్టింపజేసి కల్యాణోత్సవం నిర్వహించారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు జరిగిన వివాహ వేడుకను తిలకించిన భక్తులు పరవశించిపోయారు. కల్యాణోత్సవంలో అమ్మవారి ఆలయ అర్చకులు, వేదపండితులు భ్రమరాంబాదేవి అమ్మవారి తరుపు బంధువులుగాను, స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితులు మల్లికార్జునస్వామివారి బంధువర్గంగా నిలిచారు.
వైశిష్టంగా పాగాలంకరణ
బ్రహ్మోత్సవాల్లో పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. వివాహాల్లో పెండ్లి కుమారునికి తలపాగా చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేరుతో అనవాయితీగా కొనసాగుతోంది. గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖమండపంపై ఉండే నవనందులను అనుసంధానం చేస్తూ పాగా అలంకరిస్తారు. హస్తినాపురానికి చెందిన పృథ్వీ సుబ్బారావు దిగంబరుడై పాగాను అలంకరించారు. ఇందుకు రాత్రి 10గంటలకు ఆలయంలోని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మొత్తం ఎనిమిది పాగాలు భక్తులు స్వామివారికి సమర్పించారు. పాగాలంకరణ జరుగుతున్నంతసేపు ఆలయంలో ఓంనమఃశివాయ అంటూ శివనామస్మరణ మార్మోగింది.
పాతాళగంగలో దీపం వదులుతున్న యువతి
Comments
Please login to add a commentAdd a comment