నేడు వక్ఫ్‌బోర్డు చైర్మన్ రాక
కర్నూలు(అర్బన్): రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ గురువారం కర్నూలుకు రానున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సయ్యద్ సబీహా పర్వీన్ తెలిపారు. ఉదయం 8 గంటలకు నెల్లూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ అతిథి గృహం చేరుకుంటారని ఆమె బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు ఉస్మానియా కళాశాల రోడ్డులో ఉన్న ఉమర్ అరబిక్ స్కూల్‌కు చేరుకొని పాఠశాల పరిసరాలను పరిశీలించి, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహిస్తారన్నారు. అలాగే 3.45 గంటలకు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించిన అనంతరం జొహరాపురం చేరుకొని అక్కడే టైలరింగ్ కోర్సు పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లను అందిస్తారని తెలిపారు.
ఇద్దరి ప్రాణాలు కాపాడిన యువకులు
హొళగుంద: స్థానిక హొళగుంద–బళ్లారి రోడ్డులోని తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)లో స్నానానికి వెళ్లి ఈత రాక కొట్టుకుపోతున్న ఇద్దరిని స్థానిక యువకులు కాపాడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం సిరుగుప్పకు చెందిన షమీ, బాషాతో పాటు పలువురు హొళగుందలోని ఓ మసీదులో పెయింట్ పనికి వచ్చారు. పని ముగించుకుని సాయంత్రం స్నానం చేసేందుకు బళ్లారి రోడ్డులోని దిగువ కాలువలో దిగారు. ఇటీవల కాలువ గట్టుకు సిమెంట్ లైనింగ్ చేయడంతో ఈత షమీ, బాషా గట్టు కింద జారుకుంటూ కాలువలో కొట్టుకోపోసాగారు. వారి అరుపులు విన్న అటుగా వెళ్తున్న సిద్దిక్, మౌలాలి, సమీర్ వెంటనే కాలువలో దూకి ఇద్దరినీ బయటకు లాగారు. దీంతో యువకులను పలువురు అభినందించారు.
శ్రీమఠంలో
శివరాత్రి వేడుకలు
మంత్రాలయం: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధిలో మహా శివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు నేతృత్వంలో శివలింగానికి తుంగభద్ర జలాభిషేకం, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకాలు, ఫలపుష్పాలు సమర్పించి మహా మంగళహారతులు గావించి ప్రత్యేక పూజలు చేపట్టారు. పీఠాధిపతి శివుడిని దర్శించుకుని విశేష పూజలు చేసుకున్నారు. భక్తులు శివలింగను దర్శించుకుని నిష్ట పూజలు చేసుకున్నారు. భక్తులకు మహా శివరాత్రి విశిష్టతను భక్తులను వినిపించారు.
నేడు సీ.క్యాంపు
రైతుబజారు బంద్
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు సీ.క్యాంపు రైతు బజారును ఈ నెల 27వ తేదీన బంద్ చేయనున్నట్లు ఇన్‌చార్జ్ ఎస్టేటు అధికారి శివకుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతుబజారులో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఒకరోజు సెలవు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు, వినియోగదారులు గమనించాలని కోరారు. శుక్రవారం నుంచి రైతుబజారు పని చేస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment