గ్రంథాలయ పితామహుడు హరి సర్వోత్తమరావు
కోవెలకుంట్ల: వందేమాతరం ఉద్యమంలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడిగా.. గ్రంథాలయాల అభివృద్ధికి విశిష్ట సేవలందించి గ్రంథాలయ పితామహుడిగా.. ఆంధ్రతిలక్‌గా దేశ వ్యాప్తంగా ఖ్యాతి గడించిన మహోన్నతుడు.. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. శుక్రవారం ఆయన 66వ వర్ధంతి. కర్నూలుకు చెందిన భాగీరథీబాయి, వెంకటరావు దంపతులకు 1883 సెప్టెంబర్ 14వ తేదీన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు జన్మించారు. 1907లో ఎంఏ పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణకు గాడిచెర్ల రాజమండ్రిలో ట్రైనింగ్ కళాశాలకు వెళ్లారు. ఉదయం కళాశాలకు వెళ్తూ రాత్రివేళల్లో నిరక్షరాస్య వయోజనుల కోసం రాత్రి బడులు ఏర్పాటు చేసిన ఘనత గాడిచెర్లదే. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్‌చంద్రపాల్‌ను స్ఫూర్తిగా తీసుకోవడంతో గాడిచెర్లలో అంతర్గతంగా దాగి ఉన్న స్వాతంత్య్ర పిపాస, దేశభక్తి ఒక్కసారిగా పెల్లుబికాయి. సాహిత్యం, వయోజన విద్య, గ్రంథాలయోద్యమం, పత్రికా రచన, సంఘసంస్కరణ, సంఘీభావ ప్రకటనలు, సభలు, సమావేశాలతో గాడిచెర్ల జీవితం ముందుకు సాగింది. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్‌వారు బాలగంగాధర తిలక్‌ను అరెస్ట్ చేసిన రోజునే గాడిచెర్లను అరెస్టు చేసి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో ఆయనను ఆంధ్ర తిలక్‌గా అప్పట్లో అందరూ పిలిచేవారు. జైలులో ఉంటూనే అనేక గ్రంథాలు రచించారు. హోంరూల్ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించడమే కాకుండా బ్రిటీష్ వస్త్ర బహిస్కారం, జాతీయ విద్య, కల్లు, సారా పికెటింగ్‌లో ఈయన కనుసన్నల్లో నడిచేవి. చిత్తరంజన్‌దాస్, మోతీలాల్ నెహ్రూ స్థాపించిన స్వరాజ్య పార్టీని ఆంధ్రలో అభివృద్ధి చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ ప్రాంతాలతో ఉన్న నంద్యాల స్థానం నుంచి 1928లో పోటీచేసి మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే మద్రాసు కౌన్సిల్ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు.
నేడు గాడిచెర్ల 66వ వర్ధంతి
Comments
Please login to add a commentAdd a comment