పోసాని అరెస్టు అనైతికం
కర్నూలు (టౌన్): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తప్పిదాలను రెండేళ్ల క్రితం విమర్శించిన పోసాని కృష్ణమురళిని అర్ధంతరంగా అర్ధరాత్రి అరెస్టు చేయడం అనైతికం అని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ‘కూటమి’ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించి కేవలం కక్ష సాధింపు చర్యలకు అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 111 నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని ఎప్పుడో పాత కేసులను తిరగదోడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందులు పెట్టేందుకు ప్రభుత్వం దిగజారుడు విధానాలు అమలు చేస్తోందన్నారు.
అసలు డిప్యూటీ సీఎం ఉన్నారా?
రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారా అని ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ముందు 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని పదే పదే చెప్పిన పవన్ తర్వాత ఒక్క మహిళనైన కనిపెట్టగలిగరా అని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు విమర్శలు చేసిన విషయాన్ని వీడియోలతో సహా కర్నూలు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఏం చేశారన్నారు. త్వరలో జమిలి ఎన్నికలు వస్తున్నాయని, ప్రజలే కూటమి ప్రభుత్వం భరతం పడతారన్నారు.
రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ప్రజలే
బుద్ధి చెబుతారు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీమోహన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment