అహో బలం.. నమో నారసింహం
ఇలపై 108 దివ్యమైన వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది నవనారసింహులు కొలువైన ‘శ్రీ అహోబిల క్షేత్రం’. నల్లమల అడవుల్లో వెలసిన ఈ క్షేత్రం భక్తి ప్రవత్తులకే కాదు ప్రకృతి రమణీయతకు కూడా ఆలవాలం. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి సంతోషించిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించాడా అన్నట్లుండే పర్వత శ్రేణి. ఈ పర్వతాల తలభాగంలో వేంకటేశ్వర స్వామి (తిరుమల) నడుముపై నారసింహస్వామి (అహోబిలం), తోకపై మల్లికార్జున స్వామి (శ్రీశైలం) ఆవిర్భవించారని భక్తుల నమ్మకం. – ఆళ్లగడ్డ
● నాటి ‘అహో బలమే’ నేటి అహోబిలం
● రేపటి నుంచి ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు
● తరలిరానున్న భక్త జనం
● దినదిన ప్రవర్థమానంగా
నారసింహ క్షేత్రం
రాక్షస రాజైన హిరణ్యకశపుడి రాజ్యం ‘అహోబిలం’. తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించేందుకు హిరణ్యకశపుడిని సంహరించేందుకు లక్ష్మీనరసింహ స్వామి ఉక్కు స్తంభంలోంచి ఉద్భవించిన స్థలం అహోబిల పుణ్యక్షేత్రం. నృసింహస్వామి ఉగ్ర రూపంలో ఆవిర్భవించి హిరణ్యకశిపుడిని తన గోళ్లతో చీల్చి చంపినప్పుడు ఆయన బలాన్ని, శక్తిని దేవతలు ‘అహో బలం’ అని ప్రశంసించడంతో ఈ స్థలానికి ఆ పేరు వచ్చింది. తర్వాత ఆ పేరు ఆహోబిలంగా మారింది. ఉగ్ర నృసింహస్వామిని పరమశివుడు ‘ఉగ్రం వీరం మహావిష్ణుం’ అనే మంత్రం జపించి శాంతింపజేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాద వరదస్వామిని శాంతమూర్తిగా కొలుస్తారు.
స్వామితో సమానంగా
ఆల్వారులకు నిత్య పూజలు
ఎగువ అహోబిలం క్షేత్రంలో జ్వాలా నరసింహస్వామి, దిగువన ప్రహ్లాద వరదమూర్తులు కొలువై ఉన్నారు. ఎగువన మార్చి 3 నుంచి, దిగువన 4వ తేదీనుంచి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ప్రపంచంలో ఏ వైష్ణవ క్షేత్రంలో కూడా వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఒకే అలంకరణ, ఒకే వాహన సేవ లు వరుసగా రెండు రోజులు కొనసాగించరు. అది ఒక అహోబిల క్షేత్రానికే ప్రత్యేకం. ముందు రోజు జ్వాలా నరసింహస్వామికి జరిగిన ఉత్సవం, అలంకరణ, వాహన సేవలు మరుసటి రోజు ప్రహ్లాద వరదస్వామికి నిర్వహించడం ఆనవాయితీ. ఎగువ, దిగువ ఆలయాల చుట్టు మహా భక్తులైన ఆల్వార్లు కొలువై ఉన్నారు. వీరికి ముఖ్య వేళల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లక్ష్మీనరసింహస్వామితో పాటు ఈ మూర్తులకు పూజలు చేసి భక్తులు పరమానందం పొందనున్నారు.
బ్రహ్మ ప్రారంభించిన ఉత్సవం
సృష్టికర్త బ్రహ్మ స్వయంగా ప్రారంభించినందున బ్రహ్మోత్సవం అనే పేరు వచ్చింది. బ్రహ్మోత్సవాల్లో వాహనాల ఊరేగింపు సాగుతుంది. దానికే బ్రహ్మరథం అని పేరు. ఈ రథంలో బ్రహ్మదేవుడు ఉండి ఉత్సవం నిర్వహిస్తారు.
కోయిల్ ఆళ్వాల్ తిరుమంజనం
బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు స్వామి, అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేస్తారు. దీన్ని ’కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ అంటారు. వార్హిక బ్రహ్మోత్సవాలకు ముందు ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాలతో పాటు నవనారసింహ క్షేత్రాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
విష్వక్ష్సేనుడి పర్యవేక్షణ
శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడి పర్యవేక్షణలో అంకురార్పణ కా ర్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆలయానికి నైరుతి దిశలో నిర్ణీత ప్రదేశంలో భూదేవి (పట్ట)ని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా తీసుకొస్తారు. అలా తెచ్చిన మట్టిలో నవధాన్యాలు మొలకెత్తించే కార్యక్రమానికి అంకురార్పణ అని పేరు.
గరుడుని స్వాగత పత్రిక
లక్ష్మీనరసింహస్వాముల బ్రహ్మోత్సవాలకు సకల దేవ తామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనమైన గరుడి చిత్రాన్ని కొత్త వస్త్రంపై చిత్రీకరిస్తారు. దీ న్నే ‘ గరుడ ధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత నరసింహస్వామి సమక్షంలో నూతన కేతాన్ని పండితుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. ఆకాశానికెగిసిన గరుడుడు బ్రహ్మోత్సవాలకు రమ్మంటూ ముక్కోటి దేవతలనూ, ఆబాలగోపాలన్ని ఆహ్వానిస్తాడని అర్థం.
లక్ష్మీనృసింహుల వాహనసేవలు
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు కొనసాగుతాయి. ఒక్కో రోజు ఎగువ, రెండు వాహనాల్లో, దిగువ రెండు వాహనాల్లో స్వామి ఊరేగుతారు. ముందురోజు ఎగువన కొలువైన వాహనాల్లోనే మరుసటి రోజు దిగువన కొలువై ఊరేగుతారు. స్వామివారు అధిరోహించే ఒక్కో వాహనానికి ఒక్కో చరిత్ర ఉంది. ప్రతి వాహనంపై నుంచి స్వామి ఒక్కో సందేశమిస్తారు.
తీర్థవారి చక్రస్నానం
పదో రోజు ఉదయం స్వామి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. తొమ్మిది రోజుల పాటు వాహనసేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడానికి ఈ స్నానం జరిపిస్తారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో, ఉభయనాంచారులతో స్వామికి అభిషేక సేవ నిర్వహిస్తారు.
ధ్వజారోహణంతో సమాప్తం
పదో రోజు అర్ధరాత్రి అనంతరం ధజారోహణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత నరసింహస్వామి వారి సమక్షంలో బ్రహ్మాది దేవతలకు, అష్టదిక్పాలకులకు వీడ్కోలు చెబుతూ గరుడ కేతాన్ని ధ్వజస్తంభం నుంచి దించుతారు. దాంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.
ఎగువ అహోబిలం కొండపై వెలసిన ఉగ్రస్తంభం
క్షేత్ర విశిష్టత
వైష్ణవ సాంప్రదాయాన్ని విస్తరించేందుకు 11వ శతాబ్దంలో రామానుజచార్యులవారు, అనేక ప్రముఖ ఆళ్వారులు ఈ స్వామిని దర్శించారు. అన్నమాచార్యుడు ఈ స్వామిని దర్శించి కీర్తించాడు. వీరేగాక వివిధ సామ్రాజ్యాలకు చెందిన చక్రవర్తులు, రాజులు, నవాబాబు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు శాసనాలున్నాయి. ఈ దేవాలయం, ప్రాకారాలు నిర్మించడానికి అప్పట్లో 13 సంవత్సరాలు పట్టినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆది శంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేసినప్పుడు తన చేతులు లేకుండా పోయినందున ఉగ్ర నరసింహస్వామిని కరాలవంబ స్తోత్రము (శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే..) జపించగా ఆయనకు తిరిగి చేతులు వచ్చాయి. ఈ సన్నివేశం అహోబిలంలో జరిగింది. ఎగువ అహోబిలంలో స్వామి జ్వాలనరసింహుడై స్వయంభూగా అవతరించగా దిగువ అహోబిలంలో వేకంటేశ్వర స్వామి చేత ప్రతిష్టించబడి ప్రహ్లాదవరదుడిగా కొలువై కొలిచే వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు.
అహో బలం.. నమో నారసింహం
అహో బలం.. నమో నారసింహం
Comments
Please login to add a commentAdd a comment